ఫిరంగిపురం: మండల కేంద్రంలో నిర్వహిస్తున్న కార్మెల్‌మాత ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. కొండపై పలు ప్రాంతాల నుంచి వచ్చిన క్రైస్తవ విశ్వాసులు భక్తిశ్రద్ధలతో కార్మెల్‌మాతను దర్శించుకున్నారు. కొవ్వొత్తులు వెలిగించి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా బాల ఏసుదేవాలయంలో విచారణ గురువులు ఫాతిమామర్రెడ్డి ప్రధాన యాజకులుగా ఉండి దివ్యపూజా నిర్వహించారు. భక్తులకు దేవుని సందేశం వినిపించారు. కొండపై 9గంటలకు ఏర్పాటు చేసిన దివ్యపూజాబలి కార్యక్రమంలో విజయవాడ పీఠాధిపతి టి.రాజారావు పాల్గొని వాక్యోపదేశం చేశారు. కోరిన వరాల నిచ్చే మాతగా కార్మెల్ మాతను భక్తులు విశ్వసిస్తారన్నారు. మాతపై విశ్వాసంతో ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక ప్రశాంతత, అమ్మ అనుగ్రహం లభిస్తాయని చెప్పారు. అనంతరం 10.30 గంటలకు కార్మెల్‌మాత సమిష్టి దివ్యపూజా బలి కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన యాజకులుగా గుంటూరు మేత్రాసన నూతన అభిషిక్త గురువులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు తాగునీరు, అన్నదానం, వైద్యసదుపాయాలు కల్పించారు. పోలీసు సిబ్బంది, వలంటీర్లు భక్తులకు రద్దీలేకుండా చేస్తూ వారిరాకపోకలు పర్యవేక్షించారు. ఉత్సవాలు ప్రశాత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.


