న్యూ ఇయర్ పేరుతో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు
ఎస్పీ బి.ఉమామహేశ్వర్
బాపట్లటౌన్: న్యూ ఇయర్ ముసుగులో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ హెచ్చరించారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆకతాయి పనులకు పాల్పడకుండా, ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా వ్యవహరించాలన్నారు. ట్రిపుల్ రైడింగ్, రాంగ్‌రూట్ డ్రైవింగ్ చేయవద్దని, బైక్‌ల సైలెన్సర్లు తీసివేసి రణగొణధ్వనులను సృష్టిస్తూ వాహనాలను నడిపినా, మద్యం తాగి వాహనాలను నడిపినా వాహనాలను సీజ్ చేసి వాహన చోదకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గుంపులు, గుంపులుగా తిరుగుతూ ఇతరుల ను ఇబ్బందులకు గురిచేసే వారిని ఉపేక్షించబోమన్నారు. బాణాసంచా కాల్చడం, పరిమితికి మించిన ధ్వనితో డీజేలు ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామన్నారు. అనుమతులు లేకుండా ఈవెంట్లు నిర్వహించినా చర్యలు తప్పవన్నారు. జిల్లాలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ముఖ్యమైన కూడళ్లలో పోలీస్ పికెట్‌లు ఏర్పాటు చేయాలన్నారు.


