బీచ్‌లో రింబోలా..రింబోలా | - | Sakshi
Sakshi News home page

బీచ్‌లో రింబోలా..రింబోలా

Dec 31 2025 7:19 AM | Updated on Dec 31 2025 7:19 AM

బీచ్‌

బీచ్‌లో రింబోలా..రింబోలా

రిసార్ట్సులో మందు, విందు, డీజేలు, క్యాంప్‌ ఫైర్లు, రెయిన్‌ డ్యాన్సులు

కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రత్యేక ఏర్పాట్లు

భారీ ఈవెంట్లు ఏర్పాటు చేస్తున్న రిసార్ట్సు యాజమాన్యాలు

ఒక్కరికి రూ.2 వేలు, జంటకు రూ.4 వేలు

నిబంధనలకు నీళ్లు.. ఆమ్యామ్యాల్లో అధికారులు

చీరాల టౌన్‌: నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని సముద్ర తీర ప్రాంతం ఫ్లడ్‌ లైట్ల వెలుగులు, డీజేల హోరు, మద్యం, రెయిన్‌ డ్యాన్సులు, క్యాంపు ఫైర్లతో హోరెత్తనున్నది. కొద్ది రోజుల కిందట జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్‌ రిసార్ట్స్‌, హోటల్స్‌ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటుచేసి నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని మందు పార్టీలు, డీజేలు, ఇతర అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించరాదని, నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కానీ నిర్వాహకులు వాటిని ఖాతరు చేయకుండా పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రిసార్ట్స్‌ల్లో డీజేలు, ప్రత్యేక టెంట్లు, కుర్చీలు, డ్యాన్సర్లు, మద్యం, సకల ఏర్పాట్లు చేశారు. రిసార్ట్సులో ప్రత్యేక ఎంట్రీ టికెట్ల ద్వారా, పాస్‌లు, కూపన్లు అందించారు. న్యూ ఇయర్‌ సంబరాల్లో భాగంగా ఎంట్రీ టికెట్‌ ఒక్కొక్కరికి రూ.1800 నుంచి రూ.2వేలు, జంటకు అయితే రూ.4000 వసూలు చేస్తున్నారు.

రిసార్ట్స్‌ల్లో గదులు ఫుల్‌

జిల్లాలోని సముద్ర తీరప్రాంతాలైన రామాపురం, వాడరేవు, కఠారిపాలెం, సూర్యలంక, పొట్టిసుబ్బయ్యపాలెం, విజయలక్ష్మీపురం సముద్ర తీర ప్రాంతాల్లో సుమారు 70 వరకు రిసార్ట్స్‌ ఉన్నాయి. వీటిలో రోజుకు రూ.3000 నుంచి రూ.15 వేలు చార్జి వసూలు చేసే రిసార్ట్స్‌, గెస్ట్‌ హౌస్‌లు కూడా ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలోని వాడరేవు, రామాపురం, సూర్యలంక తీరప్రాంతాలకు ఆంధ్ర రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు వేలాది మంది గదులను బుక్‌ చేసుకున్నారు. న్యూ ఇయర్‌ సందర్భంగా గదుల అద్దెలను కూడా భారీగా పెంచేశారు. ఆనందంగా ఎంజాయ్‌ చేద్దామనుకునే వారి జేబులను గుల్ల చేసేందుకు నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేశారు. న్యూ ఇయర్‌ వేడుకల్లో పర్యాటకులను ఆనందంలో ఉర్రూతలూగించేందుకు మద్యం, వివిధ రకాల ఆహార పదార్థాలు, పలు రకాల మత్తు పదార్థాలను కూడా సిద్ధం చేశారని సమాచారం. ఎంట్రీ టికెట్‌ కొన్నవారికి పరిమితిగా ఆల్కహాల్‌, ఆహారం, రెయిన్‌ డ్యాన్సులు, క్యాంప్‌ ఫైర్‌లకు టోకెన్లు అందించారు. జిల్లాతోపాటుగా ఇతర ప్రాంతాలకు చెందిన వారు సైతం ఈ న్యూ ఇయర్‌ ఈవెంట్‌ టికెట్లు కొనుగోలు చేశారు.

ప్రత్యేకంగా బౌన్సర్ల నియామకం

తీరప్రాంత రిసార్ట్సులో అనుమతులు లేకుండా నిర్వహించే ఈవెంట్లలో పర్యాటకులను కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా బౌన్సర్లను ఏర్పాటు చేశారు. జనం రద్దీగా ఉంటుందని బౌన్సర్లను, కొంత మంది ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నారు. అనుమతులు లేకుండా బీచ్‌ ఒడ్డున క్యాంప్‌ ఫైర్లు, ఫుడ్‌ స్టాళ్లు, ఫ్లడ్‌ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో రిసార్ట్సుకు కనీసం వాహనాల పార్కింగ్‌ సక్రమంగా లేకున్నా ఈవెంట్లకు అన్నీ వసతులు ఉన్నాయని ప్రచారం చేసి మరీ టికెట్లు అమ్మకాలు చేస్తున్నారు.

పట్టించుకోని అధికారులు

రిసార్ట్స్‌ నిర్వాహకులు అనుమతులు లేకుండా భారీ ఈవెంట్లు ఏర్పాటు చేస్తున్నప్పటికీ రెవెన్యూ, పోలీస్‌, పంచాయతీరాజ్‌, ఎకై ్సజ్‌, విద్యుత్‌శాఖల అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అధికారులను ఆ వైపు కన్నెత్తి చూడకుండా అన్నీ సమకూర్చి పంపారని ప్రచారం జోరుగా సాగుతుంది. నాలుగు నెలల కిందట రామాపురంలోని పలు రిసార్ట్స్‌ల్లో అర్ధరాత్రి రేవ్‌ పార్టీలు చేసిన ఘటనలు ఉన్నా కనీసం కట్టడి చేయలేని స్థితిలో అధికారులు ఉన్నారు. చీరాలలో కొత్తగా రెండుసార్లు రేవ్‌ పార్టీలు, కొన్ని రిసార్ట్సుల్లో యథేచ్ఛగా పేకాట, లోన–బయట, కోత ముక్క జూదంతోపాటుగా ఇతర ప్రాంతాలకు చెందిన మద్యాన్ని రిసార్ట్సు నిర్వాహకులే అందిస్తున్నా పోలీసులు కానీ, ఎకై ్సజ్‌ అధికారులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. రేవ్‌ పార్టీలు జరుగుతున్నా కానీ రిసార్ట్సు నిర్వాహకుల జోలికి అధికారులు వెళ్లకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారనే సమాచారం ఉంది. మొత్తం మీద న్యూ ఇయర్‌ వేడుకలు రిసార్ట్‌ల నిర్వాహకులకు లక్షలు కురిపిస్తోంది.

బీచ్‌లో రింబోలా..రింబోలా 1
1/1

బీచ్‌లో రింబోలా..రింబోలా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement