కంటి తుడుపు కొనుగోళ్లు
పొగాకు కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం గ్రామాల్లో రైతుల వద్ద భారీగా నిల్వలు చివరి ఆకు వరకు కొంటామంటూ ఎగ్గొట్టిన ప్రభుత్వం సర్కారు ముందస్తు హామీతో మోసపోయిన రైతులు
పర్చూరు(చినగంజాం): పొగాకు కొనుగోలు విషయంలో ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు మినహా రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 18 నెలలు దాటిన తరువాత కూడా పొగాకు రైతుల సమస్యకు పూర్తి పరిష్కారం చూపలేకపోయింది. గడచిన ఏడాది కాలంగా పొగాకు కొనుగోలు విషయాన్ని నాన్చుతూనే ఉంది. చివరి ఆకు వరకు కొనుగోలు చేసి ఎట్టి పరిస్థితుల్లో రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం హామీ నెరవేర్చలేకపోయింది. నల్ల బర్లీ పొగాకును ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేపడతామన్న హామీ ఇవ్వడంతో రైతులు కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. మార్క్‌ఫెడ్ తీరా కొనుగోలు సమయానికి వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో కొనుగోలు చేపట్టకపోవడం, తీవ్రమైన ఆంక్షల మధ్య కొనుగోలు చేపట్టడంతో పొగాకు బేళ్లు రైతుల ఇళ్లలోనే మిగిలిపోయాయి.
గ్రామాల్లో రైతుల వద్ద భారీగా నిల్వఉన్న పొగాకు బేళ్లు:
ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా చేపట్టిన పొగాకు కొనుగోలు విషయంలో తీవ్రమైన ఆంక్షలు విధించడం, నాణ్యత లేదంటూ తిప్పి పంపడం, అధికార పార్టీ నాయకులు సిఫారసు చేసిన రైతుల నుంచే పొగాకు కొనుగోలు చేయడం వంటి చర్యలతో పర్చూరు నియోజకవర్గ పరిధిలో 30 నుంచి 40 శాతం మాత్రమే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారు. మిగిలిన 60 శాతం గ్రామాల్లో రైతులు తమ ఇళ్లలో నిల్వచేసుకున్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన 40 శాతం పొగాకు కూడా కొనుగోలు చేసిన ఐదు నెలల వరకు డబ్బులు జమ కాలేదు. మిగిలిన 60 శాతం పొగాకు రైతుల వద్దే మూలుగుతోంది.
చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం ....
మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేపట్టిన ప్రభుత్వం చివరి ఆకు వరకు కొనుగోలు చేపడతానని హామీ ఇచ్చింది. మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు నాణ్యతను బట్టి రూ.12 వేలు, రూ.9 వేలు, రూ.6 వేలు అంటూ మూడు రకాల రేట్లను నిర్ణయించింది. అయితే ఎక్కువ శాతం తక్కువ రేట్లకే రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసింది. అధికార పార్టీకి చెందిన నాయకులు, వారు అనుయాయులకు టాప్ రేట్‌కు కొనుగోలు చేయడం, రైతుభరోసా కేంద్రంలో సాగు దిగుబడి వివరాలు నమోదు చేసుకున్నా అధికార పార్టీ వారికే మెసేజ్‌లు పంపి వారి నుంచి కొనుగోలు చేయడం వంటి చర్యలతో పాటు ఒక్కొక్క రైతు నుంచి పండించిన పంటలో కేవలం 20 శాతం మాత్రమే కొనుగోలు చేశారు.


