ఆగిఉన్న లారీని ఢీకొన్న బైక్
బాపట్లటౌన్: రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతిచెందిన ఘటన మండలంలోని చింతావారిపాలెం సమీపంలో చోటుచేసుకుంది. వివ రాల్లోకి వెళితే.. మండలంలోని ముత్తాయపాలెం గ్రామానికి చెందిన లుక్కా శ్రీనివరప్రసాదరావు (46), అతని స్నేహితుడు కొక్కిలిగడ్డ నారాయణస్వామి ఇరువురు ద్విచక్రవాహనంపై బాపట్ల నుంచి ముత్తాయపాలెం వైపు వస్తున్నారు. మార్గమధ్య లో చింతావారిపాలెం సమీపంలో ఇసుకలోడుతో ఉన్న లారీని వెనుకనుంచి ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి ఇరువురిని చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ లుక్కా శ్రీనివరప్రసాదరావు మృతిచెందాడు. నారాయణస్వామిను ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం చీరాలలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. మృతుడు శ్రీనివరప్రసాదరావు 20 సంవత్సరాలకు పైగా ఆర్మీలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. మృతుడి స్వగ్రామం నిజాంపట్నం మండలం, చినమట్లపూడి, మృతుడి సోదరి శాంతకుమారి ముత్తాయపాలెంలో నివాసం ఉంటుంది. ఆర్మీ రిటైర్డ్ అయిన తర్వాత గత ఐదేళ్ల క్రితం సోదరి నివాసానికి సమీపంలో స్థలం కొనుగోలు చేసి ముత్తాయపాలెంలోనే నూతన గృహం నిర్మించుకున్నారు. మృతునికి భార్య ఉషశ్రీ, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి పిల్లల చదువుల నిమిత్తం గత ఏడాది కాలంగా విజయవాడలోనే నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం కళాశాలలకు సెలవు కావడంతో సోమవారం కుటుంబ సభ్యులతో స్వగ్రామమైన ముత్తాయపాలెం గ్రామానికి చేరుకున్నారు. ఇంతలోనే ఈ ఘోరం జరగడంతో మృతుడి కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తుంది.


