భారీ వాహనాన్ని ఢీకొన్న కారు
మార్టూరు: జాతీయ రహదారిపై వెళుతున్న భారీ వాహనాన్ని బ్రేకులు ఫెయిలైన కారణంగా వెనుక వస్తున్న కారు ఢీకొన్న సంఘటన మంగళవారం మధ్యాహ్నం కోనంకి, కోలలపూడి గ్రామాల మధ్య జరిగింది. హైవే మొబైల్ సిబ్బంది నాయక్ వివరాలు ఇలా ఉన్నాయి. భారీ ఇండస్ట్రియల్ ట్యాంకర్‌ను తడ నుంచి చత్తీస్ ఘడ్ తరలిస్తున్న వాహనం ఒంగోలు నుంచి విజయవాడ వైపు వెళుతోంది. విజయవాడ పాయకాపురానికి చెందిన పిళ్ళై విజయ్కుమార్ తన భార్యతో అదే మార్గంలో ఒంగోలు నుంచి విజయవాడ కారులో వెళుతున్నారు. ఈ క్రమంలో కారు బ్రేకులు ఒక్కసారిగా ఫెయిలవడంతో అదుపుతప్పి ముందు వెళుతున్న వాహన ట్యాంకర్‌ను బలంగా ఢీ కొట్టి ఆగిపోయింది. ప్రమాదంలో స్వల్ప గాయాలపాలైన విజయ్కుమార్‌ను హైవే మొబైల్ సిబ్బంది మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రహదారికి మధ్యలో ప్రమాదం జరగడంతో హైవే సిబ్బంది వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూశారు. నాయక్ సమాచారంతో మార్టూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


