రాష్ట్రస్థాయి ఖో–ఖో పోటీలకు పల్నాడు జట్టు
నకరికల్లు: క్రీడాకారులు రాణించేందుకు క్రీడాభిమానుల ప్రోత్సాహం ఎంతగానో దోహదపడుతుందని ఖో–ఖో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వి.వీరభద్రారెడ్డి అన్నారు. సీనియర్ ఖో–ఖో రాష్ట్ర స్థాయి ఛాంపియన్ పోటీలు ఈనెల 24వ తేదీ నుంచి 26 వరకు గుడివాడలో నిర్వహించనున్నారు. ఈ మేరకు పోటీలలో పాల్గొనేందుకు సన్నద్ధమైన క్రీడాకారులు మంగళవారం నకరికల్లు నుంచి గుడివాడ పయనమయ్యారు. నకరికల్లు ఉన్నతపాఠశాల పూర్వవిద్యార్థి పాపాబత్తుల కోటేశ్వరరావు తన కుమారుడు పాపాబత్తుల దానియేలు జ్ఞాపకార్థం క్రీడాకారులకు క్రీడాదుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ ఖో–ఖో పురుషుల, మహిళల జట్టులోని 30 మంది క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేసినట్లు తెలిపారు. పూర్తిస్థాయి శిక్షణ పొందిన క్రీడాకారులు జిల్లాకు గొప్పపేరు తెచ్చిపెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. 8 మంది క్రీడాకారులు నకరికల్లు ఉన్నతపాఠశాల నుంచే ఉండడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఖో–ఖో అసోసియేషన్ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి చింతా పుల్లయ్య, ట్రెజరర్ ఝాన్సీ, మాజీ కార్యదర్శి రావు కిషోర్, వ్యాయామ ఉపాధ్యాయులు పి.వెంకయ్య, ఎం.వీరయ్య, పి.ఆంజనేయులు తదితరులు క్రీడాకారులను కలసి శుభాకాంక్షలు తెలిపారు.


