
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
సంతమాగులూరు(అద్దంకి రూరల్): బైకు మీద వెళ్తున్న భార్యాభర్తలను వెనకు నుంచి లారీ ఢీకొట్టటంతో మహిళ మృతి చెందింది. ఈ ఘటన సంతమాగులూరు మండలం రామిరెడ్డిపాలెం గ్రామం వద్ద శనివారం జరిగింది. సంతమాగులూరు ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. వినుకొండ మండలం గోకనకొండ గ్రామానికి చెందిన గద్దల తిరుపతయ్య, అతని భార్య కోటేశ్వరమ్మ (44) బైక్‌పై కొమ్మాలపాడు నుంచి సంతమాగులూరు వైపు వస్తున్నారు. రామిరెడ్డిపాలెంలోని రామాలయం వద్దకు రాగానే వెనుక నుంచి లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. కోటేశ్వరమ్మకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. గాయాలైన తిరుపతయ్యను 108 వాహనంలో నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఉద్యోగం రాలేదని
యువకుడి ఆత్మహత్య
చీరాల అర్బన్: ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం బాపట్ల జిల్లా చీరాల ఐక్యనగర్‌లో చోటుచేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఐక్యనగర్‌కు చెందిన డి.వెంకటేశ్వర్లు (36) ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ చేశాడు. హైదరాబాద్‌లో శిక్షణ తీసుకుని గ్రూప్స్, కానిస్టేబుల్ పోస్టులకు ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాలేదని మనస్తాపానికి గురై శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు టూటౌన్ ఎస్‌ఐ నాగశ్రీను తెలిపారు.
యువకుడి అదృశ్యంపై ఫిర్యాదు
చౌటుప్పల్: ఆఫీసుకు వెళ్లిన యువకుడు ఇంటికి తిరిగిరాకుండా అదృశ్యమయ్యాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో శనివారం వెలుగులోకి వచ్చింది. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడు గ్రామానికి చెందిన గడిపూడి మురారి(30) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం వివాహమైంది. మూడు నెలల క్రితం గొడవ జరిగడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మురారి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని విద్యానగర్‌కాలనీలో నివాసముంటున్న తన అక్క కాంచన వద్దకు వచ్చాడు. రోజూ హైదరాబాద్‌లో ఆఫీస్‌కి వెళ్లి తిరిగి రాత్రికి వస్తుండేవాడు. 18న మురారి ఆఫీస్‌కి వెళ్లాడు. అదేరోజు రాత్రి అక్క ఫోన్ చేయగా.. ‘బస్టాండ్ వద్ద ఉన్నాను.. ఇంటికి వస్తున్నా’ అని చెప్పాడు. కానీ ఇంటికి వెళ్లలేదు. రెండు రోజులు అతడి ఫోన్ ఆన్‌లో ఉన్నప్పటికీ.. సమాధానం ఇవ్వలేదు. ఏదైనా పనిమీద ఉన్నాడేమోనని, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని భావించిన కాంచన అంతగా పట్టించుకోలేదు. 21వ తేదీ నుంచి మురారి సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ అయిపోయింది. ఎంత ప్రయత్నించినా మురారి గురించిన సమాచారం తెలియరాలేదు. దీంతో శనివారం మురారి అక్క కాంచన చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.