
ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
దుగ్గిరాల: ఎరువుల కొరత ఏర్పడుతుందని అనే అపోహతో రైతులు ఒకేసారి ఎరువులు అధిక సంఖ్యలో తీసుకెళ్లడం ద్వారా కొరత ఏర్పడుతుందని విజిలెన్స్ ఈఓ ఆర్.విజయ బాబు అన్నారు. శనివారం దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో విజిలెన్స్, అగ్రికల్చర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖల అధికారులు సంయుక్తంగా ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. విజయబాబు మాట్లాడుతూ యూరియా 58 మెట్రిక్ టన్నులు, డీఏపీ 49 మెట్రిక్ టన్నులు సొసైటీలు, ప్రైవేటు డీలర్స్ వద్ద అందుబాటులో ఉందని గుర్తించామని తెలిపారు. విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్స్ కె.చంద్రశేఖర్, వై.శివన్నారాయణ, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.
బాపట్ల అర్బన్: సెప్టెంబరు 13వ తేదీన జరిగే జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని మండల న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్ కే శ్యాంబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాపట్ల కోర్టుల సముదాయంలో మండల న్యాయ సేవా కమిటీ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోర్టులలో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల సివిల్ కేసులు, భరణం కేసులు, గృహ హింస కేసులు, మోటార్ ప్రమాద కేసులు, రెవెన్యూ కేసులు, బ్యాంకు కేసులు, చెక్ బౌనన్స్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, ముందస్తు రాజీ చేసుకోదలచిన కేసులు ఇరుపక్షాల మధ్య సామరస్యపూర్వకంగా రాజీ చేసి పరిష్కరించుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకుని తమ వివాదాలను శాంతియుతంగా రాజీచేసుకుని పరిష్కరించుకోవాలని సూచించారు.