నిజాంపట్నం: మద్యం ఓ పండంటి కాపురంలో చిచ్చు రేపింది. భార్యాభర్తల మధ్య గొడవలకు ఆజ్యం పోసింది. ఒకరు ప్రాణాలు కోల్పోయిన సంఘటన నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీ పెద్దూరులో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గోకర్ణమఠం గ్రామానికి చెందిన అమరేంద్రకు కొత్తపాలెం పంచాయతీ పెద్దూరుకు చెందిన అరుణతో 12 సంవత్సరాల కిందట వివాహమైంది.
కుమారుడు, కుమార్తె ఉన్నారు. గతంలో హోంగార్డుగా పనిచేసిన అమరేంద్ర మద్యానికి బానిసై ఉద్యోగాన్ని కోల్పోయాడు. తాగి తరచూ భార్యతో గొడవలు పడుతుండేవాడు. ఇద్దరి మధ్యా గొడవలు ఎక్కువవ్వడంతో ఏడాది కిందట అరుణ పిల్లలతో స్వగ్రామమైన పెద్దూరుకు చేరుకుంది.
ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మద్యం తాగిన అమరేంద్ర భార్యపై దాడికి తెగబడ్డాడు. ప్రతిఘటించిన అరుణ అమరేంద్రను అడ్డుకునే క్రమంలో ఆమె చేతిలోని కర్ర అతని తలకు బలంగా తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రూరల్ సీఐ సురేష్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, శవపంచనామా నిర్వహించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామరు.


