ఉత్సాహంగా పొట్టేళ్ల పోటీ
జె.పంగులూరు: మండలంలోని రేణింగవరం గ్రామంలో నూతన సంవత్సర సందర్భంగా గురువారం రాష్ట్ర స్థాయి పొట్టేళ్ల పోటీలు జరిగాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 41 పొట్టేళ్లు ఈ పోటీలో పాల్గొన్నాయి. మొదటి బహుమతిని కాకుమాను బాలకృష్ణకు చెందిన పొట్టేలు గెలుచుకోగా, రెండో బహుమతిని మేదరమెట్ల రవి పొట్టేలు గెలుపొందింది. మూడో బహుమతిని కొణిదెనమణి పొట్టేలు దక్కించుకోగా, నాలుగో బహుమతిని రేణింగవరం గంగమ్మ తల్లి గెలుపొందింది. విజేతలకు రేణింగవరం నాయుకులు బోరెడ్డి ఓబుల్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలకు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పోటీలు ఎక్కువగా జరుగుతూ ఉండేవని, ప్రస్తుతం ఈ పోటీలు కనుమరుగువుతున్న ఈ క్రీడను బతికించుకునేందుకు, ప్రజల్లో పోటీ తత్వాన్ని నిలిపేందుకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రజలంతా పోటీలను ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పొట్టేళ్ల యజమానులు, ప్రజలు పాల్గొన్నారు.


