ఘనంగా కొత్త ఏడాది వేడుకలు
బాపట్ల: బాపట్ల జిల్లా ప్రజలకు, అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం నూతనసంవత్సరం 2026 సందర్భంగా జిల్లా కలెక్టర్ బంగ్లా లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో వేద పండితుల కలెక్టర్ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం కలెక్టర్‌ను కలిసిన వారంతా విద్యార్థులకు అవసరమయ్యే విధంగా పుస్తకాలు, పెన్నులు అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల సంఘం, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, యూటీఎఫ్, సంఘాల ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్లను డైరీలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను
విజయవంతం చేయాలి
జిల్లాలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ గురువారం ప్రారంభించారు. రహదారి భద్రతా మాసోత్సవాలు ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఇది చాలా బాధాకరమని, ఈ ప్రమాదాల సంఖ్యను జీరోకు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.
బాలికలు చదువుతో పాటు
క్రీడల్లో రాణించాలి
చీరాల: బాలికలు డిగ్రీ వరకు చదివి ఉద్యోగం తెచ్చుకొని ఆర్థికంగా ఎదిగిన తర్వాతనే వివాహం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ సూచించారు. గురువారం రాత్రి చీరాల మండలం బుర్లవారిపాలెం గ్రామం సమీపంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయానికి నూతన సంవత్సరం సందర్భంగా ఆయన సతీసమేతంగా విచ్చేశారు. నూతన సంవత్సరంలో విద్యార్థినులు ఏ లక్ష్యాలను ఎంచుకున్నారని, ఎలాంటి క్రీడలంటే ఇష్టమని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఓ మహిళ ప్రపంచ కప్ గెలిచిందని, మీరు కూడా చెస్, స్కిప్పింగ్ వంటి ఆటల్లో రాణించాలని సూచించారు. అలానే కలెక్టర్ సతీమణి భూమిక చంద్రలాలి మాట్లాడుతూ నూతన సంవత్సరం మొదటి రోజున కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. బాలికలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం బాలికలకు జిల్లా కలెక్టర్ దంపతులు నోట్‌బుక్స్, పెన్నులను అందించారు. డీఈఓ ఎస్.శ్రీనివాస్, విద్యాలయ ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.
జిల్లా ప్రజలకు, అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్
ఘనంగా కొత్త ఏడాది వేడుకలు


