నా పసుపు, కుంకుమ కాపాడిన సీఎం  | Sakshi
Sakshi News home page

నా పసుపు, కుంకుమ కాపాడిన సీఎం 

Published Wed, Feb 21 2024 5:41 AM

Jagan Mohan Reddy is implementing the Navratna schemes in AP - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే  ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.  

నా పసుపు, కుంకుమ కాపాడిన సీఎం 
నా భర్త గంగాధర్‌ ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పని చేస్తున్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురంలో మాకున్న తొమ్మిది ఎకరాల్లో చీనీ సాగు చేస్తున్నాం. పెద్ద కుమారుడు విజయవాడలోని ప్రైవేట్‌ కళాశాలలో, చిన్నకుమారుడు అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో చదువుకుంటున్నారు. 2021లో కరోనా సమయంలో నా భర్తకు ఊపిరితిత్తుల సమస్య వచ్చింది. అప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేదు. శ్వాస తీసుకునేందుకూ తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో ఎక్కడికి పోవాలో కూడా నాకు దిక్కు తోచలేదు. నా భర్త ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న వలంటీర్‌ సూచన మేరకు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్లి అనంతపురంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్పించా.

నయా పైసా ఖర్చు లేకుండా వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకుని రూ.4 లక్షలకు పైగా ఖర్చయ్యే చికిత్సను ఉచితంగా అందించారు. దీంతో నా భర్త  ప్రాణాలతో బయటపడ్డారు. నా కుమారుడికి అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు చొప్పున, రైతు భరోసా పథకం ద్వారా ఏటా రూ.13,500 చొప్పున, పంటల బీమా పథకం ద్వారా రూ.72,000 వంతున రెండుసార్లు, రూ.58,000 వంతున ఇంకో రెండుసార్లు అందింది. నేను మహిళా సంఘంలో సభ్యురాలిని కావడంతో సున్నా వడ్డీ పథకం ద్వారా ఏటా రూ.3 వేలు చొప్పున మూడు పర్యాయాలు వచ్చింది. గతంలో ఏ ప్రభుత్వమూ ఇంతలా ఆదుకున్న దాఖలాల్లేవు. నా పసుపు కుంకుమ కాపాడిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎప్పుడూ రుణపడే ఉంటాను.     – ఆదిలక్ష్మి, ముకుందాపురం (జె.ఆదినారాయణ, విలేకరి, గార్లదిన్నె) 

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు 
మాది సాధారణ కుటుంబం. విజయనగరం జిల్లా తెర్లాంలో ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. కిరాయి అన్ని రోజులూ ఒకేలా ఉండేది కాదు. బేరం లేకపోతే ఆ రోజు రాబడి సున్నా. అప్పుడప్పుడు మరమ్మతు చేయించాల్సి వస్తే అప్పు చేయక తప్పేది కాదు. మా గురించి ఏ ప్రభుత్వం ఆలోచించలేదు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటి వరకు నాకు రూ.40 వేలు వచ్చాయి. అమ్మఒడి పథకం ద్వారా నా కుమార్తెకు ఏటా రూ.15 వేలు చొప్పున నాలుగేళ్లకు రూ.60 వేలు నా భార్య ఖాతాలో జమయింది. వైఎస్సార్‌ ఆసరా కింద ఏడాదికి రూ.2,800, సున్నా వడ్డీ ద్వారా ఏటా రూ.840 చొప్పున వచ్చింది. ప్రజా సంకల్ప యాత్రలో ఆటోడ్రైవర్లకు ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌ మేలును ఎన్నటికీ మరచిపోలేం.     – రాజాన రమేష్, తెర్లాం (గొండేల సూర్యనారాయణ, విలేకరి, తెర్లాం) 

జగనన్న దయతో డయాలసిస్‌ 
మాది పేద కుటుంబం. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం ప్రాతాళ్లమెరకకు చెందిన నా భర్త రేవు నాగరాజు 2013 మార్చి నుంచి కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నారు. అప్పటి ప్రభుత్వం ఎటువంటి వైద్య సాయం అందించలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్‌ చేయించడంతోపాటు నెలకు రూ.10 వేలు పింఛన్‌ సాయం ప్రకటించారు.

ఫలితంగా మా పేద బతుకులకు ధైర్యం వచ్చింది. నాలుగేళ్లుగా ఆరోగ్యశ్రీ ద్వారా వారానికి రెండుసార్లు ఉచితంగా డయాలసిస్‌ చేయించుకుంటున్నాం. తోడబుట్టిన అన్నయ్యలా జగనన్న పింఛన్‌ సాయం అందిస్తున్నారు. పింఛన్‌గా ఇప్పటి వరకు రూ.4,80,000 మేర లబ్ధి పొందాం. మా పాప చదువుకు అమ్మ ఒడి ద్వారా ఏటా రూ.15 వేలు వంతున సాయం అందుతోంది. జగనన్న రుణం తీర్చుకోలేం. ఆయనే నిరంతరం ముఖ్యమంత్రిగా ఉండాలి.       – రేవు ఎస్తేరు రాణి, ప్రాతాళ్లమెరక (కడితల శివాజీ, విలేకరి, కాళ్ల) 

Advertisement
Advertisement