సామాన్యుడి జీవితంలో నవ రత్నాలు | Jagan Mohan Reddy is implementing the Navratna schemes in AP | Sakshi
Sakshi News home page

సామాన్యుడి జీవితంలో నవ రత్నాలు

Published Tue, Dec 12 2023 4:45 AM | Last Updated on Fri, Dec 15 2023 11:42 AM

Jagan Mohan Reddy is implementing the Navratna schemes in AP - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే  ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.  

నా జీవితానికి ఆసరా దొరికింది
అప్పటి వరకు సజావుగా సాగుతున్న మా బతుకు ఒక్కసారిగా తల్లకిందులైంది. నా భర్త చిన్న శంకర్‌ కూలిపని చేసే వారు. ఉన్నంతలో ఇల్లు గడిచేది. మాకు రాజేష్, హేమసుందర్‌ సంతానం. ఒక రోజు నా భర్త తీవ్ర అనా­రోగ్యం వల్ల ఈ లోకాన్ని వీడారు. దీంతో ఏమి చేయాలో అర్థం కాలేదు. అప్పటికే పెద్దోడు రాజేష్‌ ఒకరి వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కొద్దిపాటి ఆదాయం సంపాదిస్తున్నాడు. ఇంటికి ఈ ఒక్క ఆదాయమే దిక్కయింది. హేమ­సుందర్‌ బీఫార్మసీ పూర్తి చేసి, ఉద్యోగ ప్రయ­త్నాల్లో ఉన్నాడు. ఇంటి అద్దె రూ.3,500. కుటుంబ పోషణ భారమైంది.

ఈ పరిస్థితుల్లో వైఎస్సార్‌ ఆసరా పథకం నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఏడాదికి 17,200 చొప్పున మూడు దఫాలుగా ఇప్పటి వరకు రూ.51,600 నా పొదుపు ఖాతాలో జమ అయ్యింది. ఈ సాయంతో రూ.4 వేలతో ఓ దుకాణాన్ని అద్దెకు తీసు­కుని, వస్త్ర వ్యాపారం ప్రారంభించా. చీరలు, పిల్లల దుస్తులను పొద్దుటూరు, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి రైలు ద్వారా తీసుకొని వస్తున్నా. బంధువులు, స్నేహితుల సహకారంతో వ్యాపారం సంతృప్తిగానే సాగుతోంది. దుకా­ణానికి అద్దె, కరెంటు బిల్లు రూ.800 పోను నెలకు సుమారు రూ.10 వేలు ఆదాయం ఉంటుంది. దీంతో మా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కింది. – రాగిమాను రామేశ్వరి, కురువపేట, నంద్యాల  (కొత్తపేట ద్వారకానాథ్, విలేకరి, నంద్యాల)

కళ్లెదుటే మార్పు కనిపిస్తోంది 
గతంలో జూన్‌ వస్తోందంటే భయం వేసేది. పుస్తకాలు, బట్టల కొనుగోలుకు అప్పులు చేయాల్సి వచ్చేది. మాది తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతవల్లి గ్రామం. జగనన్న పాలనలో ఏటా అమ్మఒడి పథకం కింద సాయం అందుతుండటంతో ఆర్థిక వెసులుబాటు కలిగింది. బడులు ప్రారంభం కాగానే విద్యాకానుక కిట్లు ఇచ్చారు. రోజుకో రకం కూరగాయలతో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు.

చిక్కీ, రాగిజావ ఇస్తున్నారు. నాడు–నేడు పథకం ద్వారా పాఠశాలల రూపు­రేఖలు మార్చారు. గతంలో ప్రభుత్వ పాఠ­శాలల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు ఇష్టపడే వారు కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రైవేటు కాన్వెంట్ల కంటే ప్రభుత్వ బడులే బాగున్నాయి. ఉపాధ్యాయుల కొరత లేకుండా చేశారు. రాష్ట్ర చరిత్రలో చదువుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వాన్ని ఇంత వరకు చూడలేదు.

పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడకుండా అమ్మఒడి ఉపయోగప­డుతోంది. మా పిల్లలు సత్య చైతన్య 8వ తరగతి, సాయిలక్ష్మి వర్షిత 6వ తరగతి ప్రభుత్వ బడిలోనే చదువుతున్నారు. ఇప్పటి వరకు నాలుగుసార్లు అమ్మఒడి పథకం ద్వారా సుమారు రూ.60 వేలు ఆర్థిక సాయం అందించారు. పిల్లలు కూడా గతంలో పాఠశాలలకు వెళ్లడానికి మారాం చేసేవారు. ఇప్పుడు మా కంటే ముందే నిద్రలేచి, స్నానం ముగించుకుని పాఠశాలకు వెళుతున్నారు.      – యర్రావుల వెంకటదుర్గ, అనంతపల్లి    (తాళూరి సత్యనారాయణ, విలేకరి, నల్లజర్ల)

సంతోషాల పంట పండింది
విత్తనాలు, ఎరువుల కోసం ఇదివరకు పట్నా­లకు పరిగెత్తేవాళ్లం. గంటల తర­బడి వాటి కోసం నిరీక్షించేవాళ్లం. నకిలీలు, బ్లాక్‌ మార్కెట్‌లతో నిండా మునిగిపో­యే­వాళ్లం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక వ్యవ­సాయం పండుగలా మారింది. నాది బాపట్ల జిల్లా జె. పంగులూరు మండలం జనకవరం. నాకు 3 ఎకరాల భూమి ఉంది. శనగ పంట సాగు చేస్తున్నా. గతంలో విత్తనాలు, ఎరు­వులు, పురుగు మందులు కొనుగోలు చేయా­లంటే ఇంకొల్లు, అద్దంకి పట్టణాలకు పరుగు పెట్టాల్సి వచ్చేది. అక్కడ గంటల తరబడి క్యూ లో వేచి ఉన్నా చేతికి సరుకు అందేది కాదు.

మళ్లీ ఇంకో రోజు వెళ్లాల్సి వచ్చేది. మండలానికి ఒక్క వ్యవసాయ అధికారే ఉండేవారు. ఆయన కూడా సరిగా అందుబా­టులో ఉండక పోవడంతో సరైన సూచనలు, సలహాలు లేక పంటలు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి, అన్ని సేవలను ఒకేచోట అందజేయడం చాలా బాగుంది. మా గ్రామంలోని కొంత మంది రైతులతో కలిసి శ్రీమన్నారాయణ రైతు గ్రూపు ఏర్పాటు చేసుకున్నాం.

మా గ్రూపునకు వ్యవసాయ యంత్ర పరికరాల పథకం కింద 50 శాతం సబ్సిడీతో రూ.15 లక్షల రుణం మంజూరైంది. మా గ్రూపు సభ్యులు మూడు ట్రక్కులు, రోటవేటర్‌ తీసుకున్నారు. నేను ట్రాక్టర్, ట్రక్కు, రోటవేటర్‌ తీసుకున్నా. ట్రాక్టర్‌కి రూ.2 లక్షలు, ట్రక్‌కు రూ.40 వేలు, రోటవేటర్‌కి రూ.30 వేలు సబ్సిడీ కింద ప్రభుత్వం నాకు అందించింది.

ఈ యంత్ర పరికరాల ద్వారా నా 3 ఎకరాల పొలం సాగు చేసుకుంటూనే ఇతర రైతుల పొలాల్లో నా పరికరాలను వినియోగిస్తూ అదనపు ఆదాయం కూడా పొందుతున్నాను. రైతు భరోసా ద్వారా కూడా లబ్ది పొందాను. ఈ క్రాప్‌ ద్వారా ఇన్సూరెన్స్‌ డబ్బులు కూడా వచ్చాయి. ఆర్బీకే ద్వారా సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఎన్నో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. వీటన్నింటి వల్ల దిగుబడి కూడా పెరిగింది.  ఒక్క మాటలో చెప్పాలంటే సంతోషాల పంట పండింది.     – గుర్రం దేవేంద్ర, జనకవరం (గోగులమూడి చంద్రయ్య, విలేకరి, జె.పంగలూరు) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement