గుర్రంకొండ: గుర్రంకొండ పట్టణంలోని ఆర్‌ఎంపీల ప్రయివేట్ క్లినిక్‌లను మండల వైద్యాధికారిణి ఆయిషా తనిఖీ చేశారు. బుధవారం ప్రచురితమైన సర్జన్ల అవతారమెత్తిన ఆర్‌ఎంపీలు అన్న వార్తకు వైద్యశాఖ అధికారులు స్పందించారు. ఈరోజు పట్టణంలోని అన్ని ఆర్‌ఎంపీల క్లినిక్‌లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు క్లినిక్‌లలో అనుమతిలేని ఇంజెక్షన్లు ఉండడాన్ని గమనించి ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఆర్‌ఎంపీలు తమ క్లినిక్‌లు నిర్వహించుకోవాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్‌ఎంపీలు ఇంజెక్షన్లు, సైలెన్ బాటిళ్లు, నెబ్‌లైజర్లు, రోగులను బెడ్లపై ఉంచకూడదన్నారు. రక్త పరీక్షలు, ఎక్స్‌రేలు, ఫిజియోథెరపి వంటి సేవలు అందించకూడదన్నారు. గళ్ల పరీక్షలు చేయకూడదన్నారు. స్టెరాయిడ్, మత్తుమందు మరియు హార్మోనల్ మందులు రోగులకు ఇవ్వడం చట్టరీత్యా నేరమన్నారు. గర్భవతులు, బాలింతలకు, చిన్నపిల్లలకు, ఎటువంటి వైద్యసేవలు చేయరాదన్నారు. ఆమె వెంట సీహెచ్‌వో సీతారామయ్య పాల్గొన్నారు.
వాటర్ గ్రిడ్ పనులను
పూర్తి చేయాలి
– కలెక్టర్ నిశాంత్ కుమార్
గాలివీడు: వెలిగల్లు రిజర్వాయర్ ఆధారంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పరిధిలోని అన్ని గ్రామాలకు ఇంటింటికీ కుళాయి ద్వారా సురక్షిత తాగునీటిని అందించాలని స్పష్టం చేశారు. బుధవారం వెలిగల్లు రిజర్వాయర్ వద్ద జరుగుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు, కాఫర్ డ్యామ్ నిర్మాణ పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి పురోగతిని సమీక్షించారు. పనుల్లో వేగం పెంచేందుకు అదనపు సిబ్బంది, అవసరమైన యంత్రసామగ్రిని సమకూర్చుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులకు సూచించారు.అనంతరం గాలివీడులో ఏర్పాటు చేసిన ఎంఎస్ పైపుల తయారీ యార్డును సందర్శించి పైపుల తయారీ, సరఫరా ఏర్పాట్లను పరిశీలించారు. పైపుల తయారీతో పాటు పైప్‌లైన్ నిర్మాణ పనులను సమాంతరంగా చేపట్టి, అవసరమైన పైపులను సకాలంలో అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. రిజర్వాయర్ పనులు, పైపుల తయారీ, పైప్‌లైన్ నిర్మాణం, ఇతర అనుబంధ పనులన్నింటినీ సమన్వయంతో పూర్తి చేయాలని, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసి గ్రామీణ ప్రజలకు ఇంటింటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీఆర్‌ఈఓ కే.శ్రీధర్, గాలివీడు ఆర్డబ్ల్యూఎస్ సెక్షన్ అధికారి కృష్ణయ్య, తహసీల్దార్ భాగ్యలక్ష్మి, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, ఆర్వీఆర్ ఏజెన్సీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ విజయ సింహారెడ్డి, ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


