● బెంగళూరు హోటల్లో ఉండగా..
● ఎన్నికకు ముందు రోజు టీడీపీ దుర్మార్గం
● ఎంపీపీ పదవి కోసం అడ్డదారులు
సాక్షి, మదనపల్లె: ఒక ఎంపీపీ పదవి కోసం అధికార టీడీపీ కుట్రలు, కుతంత్రాలకు తెరతీసింది. ఎంపీపీ ఎన్నిక జరిగే ముందు రోజు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీ సభ్యుడి కిడ్నాప్‌కు పాల్పడింది. కిడ్నాప్‌కు గురైన ఎంపీటీసీ రామసముద్రం మండలానికి చెందిన ఓ టీడీపీ నేత వద్ద ఉన్నట్టు సమాచారం బుధవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. వైఎస్‌ఆర్ సీపీ నాయకుల ఫిర్యాదు, కుటుంబీకుల సమాచారం మేరకు వివరాలు.
టీడీపీకి మెజార్టీ లేదని..
ఈనెల 5న జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో రామసముద్రం మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు పోటీ జరిగింది. ఇందులో వైఎస్‌ఆర్‌సీపీ కమ్మవారిపల్లె, కాపల్లి, పెద్దకురవపల్లె, ఎలవా నెల్లూరు, ఆర్ నడింపల్లి, అరికెల, మూగవాడి ఎంపీటీసీ స్థానాలను గెలిచింది. మిగిలిన ఏడు స్థానాల్లో టీడీపీ ఆరు, జనసేన ఒకటి గెలిచింది. దాంతో రామసముద్రం ఎంపీపీ పదవిని దక్కించుకోవడానికి టీడీపీకి మెజార్టీ లేదు. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించగా ఎవరు అంగీకరించలేదు.
బెంగళూరు హోటల్‌లో కిడ్నాప్ ..
రామసముద్రం మండలం కమ్మవారిపల్లెకు చెందిన ఎంపీటీసీ జే.విజయ్ కుమార్ బెంగళూరు వైట్ ఫీల్డ్ సురక్ష స్టే హోటల్లో ఉండగా టీడీపీకి చెందిన వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ విషయమై ఆ హోటల్ యాజమాన్యం అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు స్థానిక నాయకులు తెలిపారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హోటల్ వద్ద ఉన్న సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. గురువారం రామసముద్రం ఎంపీపీ ఎన్నిక ఉండటంతో ఒక ఎంపీటీసీ అవసరం కావడంతో టీడీపీ నేతలే విజయ్ కుమార్ ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారన్న విషయం స్పష్టమైంది. ఇదే విషయాన్ని అతని తల్లి లక్ష్మీదేవి అన్నమయ్య ఎస్పీకి చేసిన ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు.
ఆచూకీ గుర్తించండి
ఎంపీటీసీ విజయకుమార్ కిడ్నాప్ గురైన నేపథ్యంలో బుధవారం సాయంత్రం అతని తల్లి లక్ష్మీదేవి, సోదరుడు, మాజీ సర్పంచు చరణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి, నాయకులు మదనపల్లిలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ గురైన తన బిడ్డ ఆచూకీ తక్షణమే గుర్తించి సురక్షితంగా తమకు అప్పగించాలని లక్ష్మీదేవి విన్నవించారు. తిప్పారెడ్డి మాట్లాడుతూ విజయకుమార్‌ను టీడీపీ నేతలే కిడ్నాప్ చేశారని అన్నారు.


