సర్జన్ల అవతారమెత్తిన ఆర్‌ఎంపీలు | - | Sakshi
Sakshi News home page

సర్జన్ల అవతారమెత్తిన ఆర్‌ఎంపీలు

Nov 18 2026 1:38 AM | Updated on Nov 18 2026 1:38 AM

ఆర్‌ఎంపీల నిర్లక్ష్యపు వైద్యం వికటించి రోగులు చావు అంచుల దాకా వెళ్తున్న ఘటనలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి:

● ఇటీవల గుర్రంకొండలో ఒక వ్యక్తికి ఆర్‌ఎంపీ అందించిన వైద్యం వికటించడంతో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది.

● మరో ఇద్దరు రోగులకు స్థానిక ఆర్‌ఎంపీలు చేసిన చికిత్స వికటించి పరిస్థితి విషమించడంతో, కుటుంబ సభ్యులు వారిని హుటాహుటిన బెంగళూరులోని ఆస్పత్రులకు తరలించి ప్రాణాలు కాపాడుకున్నారు.

● అలాగే, గుర్రంకొండ పరిసర గ్రామాల నుండి అత్యవసర చికిత్స కోసం వచ్చిన ముగ్గురు రోగులకు సరైన వైద్యం అందక ప్రాణాల మీదకు రావడంతో, బంధువులు మదనపల్లెలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి ప్రాణాలు దక్కించుకున్నారు.

● రోగుల ప్రాణాలతో చెలగాటమాడిన ఇద్దరు ఆర్‌ఎంపీలను ఆగ్రహించిన బాధితుల బంధువులు చితకబాదిన ఘటనలు కూడా ఇక్కడి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌, గుర్రంకొండ : మండల కేంద్రమైన గుర్రంకొండలో పలువురు ఆర్‌ఎంపీల అక్రమ వైద్యం అమాయక రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. నిబంధనల ప్రకారం కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే అందించాల్సిన వీరు, తమ పరిధిని పూర్తిగా అతిక్రమించి పెద్ద పెద్ద కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో నిపుణులైన సర్జన్లు, ఎంబీబీఎస్‌ వైద్యులు చేయాల్సిన క్లిష్టమైన చికిత్సలను సైతం నిర్వహిస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది. శాసీ్త్రయ అవగాహన లేని ఈ అరకొర వైద్యంతో సాధారణ వైరల్‌ జ్వరాల నుండి ప్రాణాంతక జబ్బుల వరకు చికిత్సలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

చిన్నపాటి జబ్బులకే నిలువుదోపిడీ..

పసిపిల్లలకూ క్యాన్యులా

సాధారణ జ్వరం, జలుబుతో వచ్చే అమాయక రోగులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఆర్‌ఎంపీలు నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. వచ్చిన జబ్బుకు సంబంధం లేని అనవసరపు వైద్య పరీక్షలు (టెస్టులు) చేయిస్తూ, వాటికి తగ్గట్టుగా భారీ మొత్తంలో మందులు అంటగడుతున్నారు. ఇలా పరీక్షలు, మందుల పేరుతో ఒక్కో రోగి నుండి సరాసరి రూ.1,000 నుండి రూ.3,000 వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. చివరకు సున్నితమైన పసిపిల్లలకు కూడా ఇంజెక్షన్లు వేయడానికి నరాలకు క్యాన్యులా అమరుస్తూ వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు.

క్లినిక్‌ల ముసుగులో అక్రమ మెడికల్‌ షాపులు..

పలువురు ఆర్‌ఎంపీలు తాము నిర్వహిస్తున్న క్లినిక్‌ల లోపలే ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మందుల దుకాణాలను ఏర్పాటు చేశారు. వైద్యం కోసం వచ్చే రోగులు బయట ఎక్కడా కాకుండా కచ్చితంగా తమ వద్దే మందులు కొనుగోలు చేయాలని తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. అసలు తమకు వచ్చిన రోగం ఏమిటో, తాము వాడుతున్న మందులు ఏమిటో కూడా తెలియక గ్రామీణులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. అంతటితో ఆగకుండా, ప్రభుత్వాస్పత్రులలో నిరుపేదలకు ఉచితంగా ఇవ్వాల్సిన మందులను సైతం పక్కదారి పట్టించి, తమ క్లినిక్‌లలో రోగులకు డబ్బులకు విక్రయించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నిబంధనల మేరకే నిర్వహించాలి

ప్రభుత్వ నిబంధనల మేరకే ఆర్‌ఎంపీలు, పీఎంపీలు క్లీనిక్‌లను నిర్వహించుకోవాలి. ప్రయివేట్‌ క్లీనిక్‌లను నర్సింగ్‌హోమ్‌ తరహాలో నడపకూడదు. ప్రభుత్వ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా వారి పైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొంటాము. తమ తనిఖీల్లో ఎవరైనా తప్పుచేస్తూ పట్టుబడితే చర్యలు తప్పవు.

– ఉషశ్రీ, డీఎంఅండ్‌హెచ్‌వో,

అన్నమయ్య జిల్లా

తూతూమంత్రంగా విచారణలు.. కరువైన కఠిన చర్యలు!

గుర్రంకొండలో ఇంత బహిరంగంగా అక్రమ వైద్యం, ప్రభుత్వ మందుల విక్రయం జరుగుతున్నా సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో పలుమార్లు స్థానిక ఆర్‌ఎంపీల తీరుపై వివాదాలు, ఫిర్యాదులు రావడంతో జిల్లా వైద్యశాఖ అధికారులు విచారణకు వచ్చారు. అయితే, మొక్కుబడిగా నామమాత్రపు విచారణ జరిపి వెళ్లిపోవడం తప్ప ఇంతవరకు బాధ్యులపై ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అధికారుల ఉదాసీనత వల్లే ఆర్‌ఎంపీలు మరింత బరితెగిస్తున్నారని, ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటేనే అమాయక ప్రజల ప్రాణాలు దక్కుతాయని స్థానికులు కోరుతున్నారు.

వైద్యం ముసుగులో ప్రాణాలతో చెలగాటం!

గాలిలో రోగుల ప్రాణాలు

చిన్నపాటి జబ్బులకే నిలువుదోపిడీ

పసిపిల్లలకూ క్యాన్యులా వేస్తున్న వైనం

క్లినిక్‌ల లోపలే అక్రమ మెడికల్‌ షాపులు

ప్రభుత్వాస్పత్రి మందులతోనూ దందా

తూతూమంత్రపు విచారణలతో సరిపెడుతున్న వైద్యశాఖ అధికారులు

వికటిస్తున్న వైద్యం.. ప్రాణాలు కాపాడుకుంటున్న బాధితులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement