తిరుపతి రూరల్ : గుర్తుపట్టలేని విధంగా మహిళ ముఖాన్ని బండరాయితో మోది హత్య చేసిన కేసును తిరుపతి రూరల్ పోలీసులు 17 రోజుల్లోనే ఛేదించారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, కాల్‌డేటా, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
తిరుపతి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సి.మల్లవరం గ్రామ సమీపంలోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో అక్టోబర్ 31న గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ముఖం గుర్తుపట్టలేని విధంగా బండరాయితో మోది హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో ఆధారాలు లభించకపోవడం, మృతురాలి వివరాలు తెలియకపోవడంతో కేసు దర్యాప్తు సవాలుగా మారింది. మృతదేహం ఫొటోలు, దుస్తులు, ఇతర ఆనవాళ్ల ఆధారంగా పోలీసులు చుట్టుపక్కల గ్రామాల్లో విచారణ చేపట్టారు. వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసులను పరిశీలించారు. పత్రికల్లో ప్రచురితమైన సమాచారం ఆధారంగా మృతురాలి తల్లిదండ్రులు పోలీసులను కలసి తన బిడ్డ భాగ్యశ్రీ (26)గా గుర్తుపట్టారు. తన బిడ్డను అంత కిరాతకంగా చంపేంత శత్రువులు ఎవ్వరు లేరని చెప్పారు. చిత్తూరు జిల్లా రొంపిచెర్లకు చెందిన భాగ్యశ్రీ తిరుపతిలోని ఓ బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డు కార్యాలయంలో పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. దీంతో ఆమె చివరిసారిగా ఎవరితో ఫోన్‌లో మాట్లాడింది ? ఎక్కడెక్కడ సంచరించింది? అనే కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.
సీసీ కెమెరాలు.. కాల్ డేటాతో అరెస్ట్
తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని వందలాది సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్(ఏఎన్‌పీఆర్) కెమెరాల ద్వారా అనుమానిత వాహనాల కదలికలను విశ్లేషించారు. కాల్ డేటా రికార్డులు (సీడీఆర్), మొబైల్ టవర్ లొకేషన్ల ఆధారంగా మృతురాలితో సంబంధం ఉన్న వ్యక్తులపై ఆరా తీశారు. ఈ క్రమంలో అన్ని ఆధారాలు పరిశీలించిన తరువాత షేక్ జమాలుల్లా బాషా అలియాస్ జమీల్ బాషా (38) హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. అప్పటికే నిందితుడు పరారీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించారు. ఈనెల16న సోమవారం రాత్రి చిత్తూరు జిల్లా రొంపిచెర్ల క్రాస్ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన ఏపీ 39 టీసీ 6458 నంబరు గల ఆటో, రెండు సెల్‌ఫోన్లు, రూ.450 నగదును అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్టు సీఐ మద్దయ్యాచారి తెలిపారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు.
అనుమానమే హత్యకు కారణం..
భాగ్యశ్రీ, జమీల్ బాషా ఇద్దరూ రొంపిచెర్లకు చెందినవారు. సమీప గృహాల్లో నివాసం ఉండటంతో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే తిరుపతిలోని క్రెడిట్ కార్డు కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న భాగ్యశ్రీ సహచర ఉద్యోగులతో సన్నిహితంగా ఉండటాన్ని జమీల్ బాషా జీర్ణించుకోలేకపోయాడు. ఆమె తనను దూరం పెడుతోందనే అనుమానంతో కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆమెను పలు మార్లు హెచ్చరించాడు. ఆ తరువాత హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఎప్పటిలాగానే తన ఆటోలో ఆమెను ఎక్కించుకుని సి.మల్లవరం జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న వెంచర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ కొంత సేపు ఇద్దరు గొడవపడగా ఆ వెంటనే బండరాయితో భాగ్యశ్రీ తలపై మోది దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడించినట్టు సమాచారం. కాగా నిందితుడిని అరెస్ట్ చేసిన తిరుపతి రూరల్ పోలీసులను జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారి, చంద్రగిరి డీఎస్పీ పి.జగదీష్ నాయక్‌అభినందించారు.
17 రోజుల్లో మిస్టరీని ఛేదించిన తిరుపతి రూరల్ పోలీసులు
ఆటోలో తీసుకెళ్లి.. బండరాయితో మోది మహిళ దారుణ హత్య
నిందితుడి అరెస్ట్.. ఆటో, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం


