హత్య కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్‌

Nov 18 2026 1:38 AM | Updated on Nov 18 2026 1:38 AM

మదనపల్లె టౌన్‌ : పాతకక్షలతో యువకుడిని దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తాలూకా సర్కిల్‌ ఇన్‌న్‌స్పెక్టర్‌ రవి నాయక్‌, ముదివేడు ఎస్సై మధు రామచంద్రుడు తెలిపారు. బి.కొత్తకోట మండలం బండారువారిపల్లె పంచాయతీ, పెద్దపల్లెకు చెందిన ఎం.మహేష్‌ (34), అదే గ్రామానికి చెందిన సి.ప్రశాంత్‌బాబు మధ్య ఏడాది క్రితం భూమికి సంబంధించిన గొడవ జరిగింది. ఆ సమయంలో ప్రశాంత్‌బాబు వర్గీయులు మహేష్‌పై దాడి చేయడంతో అప్పట్లో ఇరువర్గాలపై బి.కొత్తకోట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ ఘటన తర్వాత మహేష్‌ తన నివాసాన్ని మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లెకు మార్చుకున్నాడు. అప్పటి నుంచి ఇరువురి మధ్య కక్షలు మరింత ముదిరి, ఒకరినొకరు అంతమొందించేందుకు పథకాలు వేసుకునేవారు. ఈ క్రమంలో ఈ నెల 2వ తేదీన ప్రశాంత్‌బాబు ద్విచక్ర వాహనంపై తన స్వగ్రామం నుంచి మదనపల్లె వైపు వస్తుండగా, మహేష్‌ మరో ఇద్దరు యువకులతో కలిసి కారులో వెళ్తూ కురబలకోట మండలం కంటేవారిపల్లి సమీపంలో అతడి వాహనాన్ని ఢీకొట్టాడు. కిందపడిన ప్రశాంత్‌బాబును పక్కనే ఉన్న మట్టిరోడ్డు వైపు లాక్కెళ్లి గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న మహేష్‌ కోసం గాలిస్తుండగా, మంగళవారం మదనపల్లె పట్టణం నిమ్మనపల్లె సర్కిల్‌ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement