గురువారం దాకా తలలు పగల్గొట్టారు..
శుక్రవారం గులాబీ పూలిచ్చారు
ఇంటి నుంచి ఆఫీస్ దాకా
అదనపు ఎస్పీ, కలెక్టర్ల వీడియో
● సుప్రీం కోర్టు షాక్‌తో ‘పచ్చ’ ఖాకీల నయా కస్టమర్ కేర్ సర్వీస్
● అన్నమయ్య జిల్లాలో పచ్చయంత్రాంగం ఆడిన సరికొత్త నాటకం
● కోర్టుకు అంతా సవ్యంగా
జరిగింది అని రికార్డులు
సమర్పించడానికి తంటాలు
సాక్షి, మదనపల్లె: అధికార కూటమి రాజ్యంలో అంతా మాయ.. అంతా వింత! స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో శుక్రవారం నాడు కళ్లముందు సాగిన హై–వోల్టేజ్ డ్రామా చూస్తే సాక్షాత్తూ ఆ బ్రహ్మదేవుడైనా ముక్కున వేలేసుకోవాల్సిందే! ఈ నెల 16న మున్సిపల్ ఎన్నికల ముహూర్తం కుదిరినప్పటి నుంచి, నిన్న మొన్నటి జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల దాకా జిల్లాలోని ప్రతి కేంద్రం ఒక కౌబాయ్ సినిమాను తలపించింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వస్తే చాలు.. పోలీసులు తమ అపూర్వమైన ‘నిఘా నేత్రాలను’ మూసేసుకునేవారు, అదే సమయంలో పచ్చ తమ్ముళ్లు కట్టెలు, రాళ్లు, సోడా సీసాలతో వచ్చి అభ్యర్థుల తాళులు తెంపి, బట్టలు లాగి, హత్యాప్రయత్నాలు చేస్తూ అత్యంత శాంతియుతంగా నామినేషన్ పత్రాలను గాల్లోకి విసిరి జల్లెడ పట్టేవారు. మా నామినేషన్లు స్వీకరించండి మహాప్రభో అంటూ కాళ్లా వేళ్లా పడి వేడుకున్నా కనికరించని వ్యవస్థలు.. ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు కొరడా దెబ్బలు తగలగానే ఒక్కసారిగా ఐస్‌క్రీమ్‌లా కరిగిపోయాయి. అయితే ఏమండీ.. ‘డామిట్.. కథ అడ్డం తిరిగింది!’ అన్న చందంగా శుక్రవారం నాడు సీన్ మొత్తం ఉల్టా పుల్టా అయిపోయింది. నిన్నటివరకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్ కేంద్రాలకు కిలోమీటరు దూరంలోనే ముళ్లకంచెలు వేసి, ఎండలో మాడ్చిన అదే పోలీసు యంత్రాంగం.. సుప్రీంకోర్టు మొట్టికాయలు పడగానే సడన్‌గా ‘కస్టమర్ కేర్’ సెంటర్‌లా మారిపోయింది. ‘ఎవరైనా అడ్డుకుంటే మాకు ఫోన్ చేయండి, మేమే మీ వద్దకు వస్తాం’ అంటూ వాట్సాప్ గ్రూపుల్లో వీడియోలు వదులుతూ పబ్లిసిటీ స్టంట్లు మొదలెట్టారు. సాయంత్రం ఐదు గంటల గడువు ముగిసేవరకు జిల్లా ఎస్పీ, ఇతర పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పరుగులు పెట్టడం చూస్తే.. నిన్నటివరకు దౌర్జన్యాలకు వత్తాసు పలికినవారేనా వీరు అనే సందేహం కలగక మానదు. అసలు నమ్మశక్యం కాని ఈ సరికొత్త నాటకంలో మైలురాయి లాంటి ఘట్టం ఏమిటంటే.. జిల్లాకు చెందిన పలువురు సీఐలు శుక్రవారం ఉదయం నుంచే నయా ప్రమోషనల్ వీడియోలు పంపడం మొదలుపెట్టారు. నిన్నటిదాకా ప్రతిపక్ష అభ్యర్థులు స్టేషన్ల చుట్టూ తిరిగినా కనీసం మొహం కూడా చూడని మదనపల్లె వన్‌టౌన్ సీఐ మోహన్ కుమార్, బి.కొత్తకోట సీఐ కళా వెంకటరమణ, రూరల్ సీఐ రవి నాయక్, తాలూకా సీఐ మహమ్మద్ రఫీ, మరియు ఏఎస్పీ వెంకటాద్రిలు సడన్‌గా ‘ఎలక్షన్ గైడ్‌లు’గా మారిపోయారు. ‘అభ్యర్థులు ఎవరైనా స్వేచ్ఛగా రండి, మీ భద్రతకు మాదే గ్యారెంటీ.. అవసరమైతే మాకు ఫోన్ చేయండి, మీ వద్దకే వచ్చి మేమే స్వయంగా నామినేషన్ కేంద్రానికి తీసుకువస్తాం’ అంటూ రేడియో జాకీల తరహాలో తమ పర్సనల్ సెల్ నంబర్లను మైకుల్లో పదే పదే చదవడం ఈ దశాబ్దపు నవ్వుల జాతరగా నిలిచింది. తమ ఉద్యోగాలెక్కడ ఊడిపోతాయో అన్న భయంతో.. శ్రీహింసకు గురైన వారు దయచేసి వచ్చి నామినేషన్లు వేయండ్ఙి అంటూ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్లను పదే పదే ప్రకటిస్తూ అధికారులు పడిన ఆరాటం అంతా ఇంతా కాదు. కోర్టుకు ‘మా జిల్లాలో అంతా సవ్యంగానే ఉంది’ అని రికార్డులు సమర్పించడానికి పచ్చ యంత్రాంగం ఆడిన ఈ సరికొత్త నాటకం చూసి పల్లెల్లో జనాలు పగలబడి నవ్వుకుంటున్నారు!
నిన్నటిదాకా నామినేషన్ పత్రం కనిపిస్తే చించిపారేసి, అభ్యర్థుల కాళ్లు చేతులు విరగ్గొట్టిన ‘సింగం’ లాంటి పోలీసులు.. శుక్రవారం సడన్‌గా ‘అతిథి దేవోభవ’ అంటూ గేట్లు తెరిచి సెల్యూట్లు కొట్టడం ఈ శతాబ్దపు అతిపెద్ద కామెడీ!
హోమ్ డెలివరీ భద్రత
‘మీరు ఎక్కడున్నా సరే.. ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండి.. మేమే జీపు వేసుకుని వచ్చి మిమ్మల్ని అత్యంత భద్రంగా, రౌడీలు కొట్టకుండా నామినేషన్ కేంద్రానికి డ్రాప్ చేస్తాం’ అంటూ టోల్–ఫ్రీ నంబర్లు పంచుతుంటే.. వీరు రక్షక భటులా లేక ట్రావెల్స్ ఏజెంట్లా అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు!
వేడుకోళ్లు
పరిస్థితి ఎంత విచిత్రంగా మారిందంటే.. ఏఎస్పీ వెంకటాద్రి, చివరకు కలెక్టర్ నిశాంత్ కుమార్ కూడా వరుసగా వీడి యో సందేశాలు విడుదల చేస్తూ, శ్రీహింస వల్ల నామినేషన్ వేయలేకపోయిన వారు ఉంటే దయచేసి కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయండి.. మేము రక్షణ కల్పిస్తాం్ఙ అని ప్రాధేయపడటం ఈ శతాబ్దపు మోస్ట్ ఐరానిక్ సీన్!


