ఎంపీటీసీ అభ్యర్థిగా పెద్దమ్మ | - | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీ అభ్యర్థిగా పెద్దమ్మ

Oct 24 2026 4:53 AM | Updated on Oct 24 2026 4:53 AM

● కొనసాగిన పచ్చమూక గూండాగిరీ ● వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులను అడుగడుగునా అడ్డగింత ● టీడీపీ నేతలకే వత్తాసు పలికిన పోలీసులు

● కొనసాగిన పచ్చమూక గూండాగిరీ ● వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులను అడుగడుగునా అడ్డగింత ● టీడీపీ నేతలకే వత్తాసు పలికిన పోలీసులు
అధర్మాన నిలిచిన టీడీపీ మూకలు అదే దౌర్జన్యకాండను కొనసాగించాయి.. వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులను అడుగడుగునా అడ్డగించాయి.. నామినేషన్‌ వేయకుండా ప్రతిఘటించాయి.. రాజ్యాంగ హక్కును కాలరాశాయి.. అరాచక శక్తుల ఆటకట్టించాల్సిన ఖాకీలు టీడీపీ గూండాగిరీకి సలాం చేశారు.. అన్యాయం అని తెలిసీ వారికి తలొగ్గారు.. ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పరిశీలన తూతూ మంత్రంగా సాగింది.. దీంతో.. తెలుగుదేశం నాయకులు మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ఊగిపోయారు.. దాడులతో రౌడీరాజ్యం తలపించారు..

సాక్షి, మదనపల్లె: మేం నామినేషన్లు వేయిస్తాం, అభ్యర్థులకు భద్రత కల్పిస్తామని పోలీస్‌ శాఖ చేసిన ప్రచారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్‌ కుమార్‌ రెడ్డి ఇలాఖాలు రాయచోటి, పీలేరు నియోజకవర్గాల్లో ఇవి మచ్చుకై నా అమలు కాలేదు. ఇదే సందర్భంలో శుక్రవారం ఎస్పీ ధీరజ్‌ కునుబల్లి, జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మ ఈ రెండు నియోజకవర్గాల్లో పర్యటించినప్పటికీ గత రెండు రోజులుగా నెలకొన్న పరిస్థితులే నామినేషన్ల చివరి రోజు శుక్రవారం కూడా నెలకొంది. టీడీపీ మూకల దాడులు, నామినేషన్‌ పత్రాలు లాక్కోవడం జరిగాయి. మేం నామినేషన్లు వేసుకోవాలి, టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారంటూ వేడుకున్న వాల్మీకిపురం వైఎస్‌ఆర్‌సీపీ నాయకులకు పోలీసులు లాఠీ రుచి చూపించారు.

సహకరించమంటే లాఠీచార్జి

పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వస్తుంటే అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నేతలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి సరైన సహకారం లభించలేదు. దీన్ని నిరసిస్తూ గాంధీ విగ్రహం వద్ద రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి తనయుడు, పార్టీ నాయకులు సాయి కృష్ణారెడ్డి, నేతలు, కార్యకర్తలతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. దీన్ని జీర్ణించుకోలేని పోలీసులు లాఠీచార్జితో చెదరగొట్టారు. పార్టీ నేతలు సాయి కృష్ణారెడ్డి, కేశవరెడ్డి, శివారెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌ తరలించి సాయంత్రం విడుదల చేశారు.

అభ్యర్థులపై దాడులు ..

రాయచోటి నియోజకవర్గంలో నామినేషన్లు వేసేందుకు వస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. గాలివీడు మండలం అరవీడు, గోరాన్‌ చెరువు నుంచి మహిళా అభ్యర్థులు ఆటోలో వస్తుండగా దాడి చేసి ఆటో ధ్వంసం చేశారు. నామినేషన్లను లాక్కొని వెళ్లారు. సంబేపల్లి మండలం దేవపట్ల నుంచి వస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను కొట్టి నామినేషన్‌ పత్రాలను లాక్కొని పోయారు.

కురబలకోటలో..

తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోటలో నామినేషన్లు వేసేందుకు వస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ శ్రేణులు వెంటపడి దాడులకు పాల్పడ్డాయి. నామినేషన్లు వేసేందుకు కార్యాలయంలోకి వెళ్తుండగా అడ్డుకొని దాడి చేశాయి.

అయినా అడ్డంకులే ..

నామినేషన్లు వేయిస్తామని ఎస్పీ స్వయంగా చెప్పినప్పటికీ పీలేరు నియోజకవర్గంలో పోలీసులు ఎస్పీ ఆదేశాలు ఖాతరు చేయలేదు. పీలేరు, కెవి.పల్లె, కలికిరి, వాయల్పాడులో నామినేషన్ల దాఖలుకు టీడీపీ అడుగడుగునా అడ్డుపడింది. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేకపోయారు. తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో నామినేషన్లు వేసేందుకు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు కేంద్రంలోకి వెళ్లినా వాటిని సమర్పించలేకపోయారు. కార్యాలయం వద్ద తిష్ట వేసిన టీడీపీ నాయకులు నామినేషన్‌ పత్రాలను లాక్కున్నారు.

కిడ్నాప్‌, విడుదల..

పొన్నూరు నియోజకవర్గం రొంపిచర్ల లో వైఎస్‌ఆర్‌సీపీ నేత శివకుమార్‌ ను టీడీపీ నేతలు కిడ్నాప్‌ చేశారు. ఎన్నికలకు దూరం చేయాలన్న లక్ష్యంతో ఆయన్ను పెళ్లికోనంగుడి వద్ద కిడ్నాప్‌ చేసి సాయంత్రం ఐదు గంటల తర్వాత విడిచిపెట్టారు. అలాగే మోటుమల్లెల నుంచి నామినేషన్‌ పత్రాలతో వస్తున్న రెడ్డమ్మ నుంచి టీడీపీ మూకలు పత్రాలను లాక్కున్నారు.

వైఎస్సార్‌సీపీ పేరుతో నామినేషన్లు..

పుంగనూరు నియోజవర్గం చౌడేపల్లిలో, పీలేరు నియోజకవర్గ పీలేరు, వాయల్పాడులో వైఎస్‌ఆర్‌సీపీ పేరిట దాఖలైన నామినేషన్ల పై ఆ పార్టీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ పేరిట నామినేషన్లు దాఖలు చేసి మోసానికి పాల్పడుతున్నారని చెబుతున్నారు. అన్ని పార్టీల నామినేషన్లలో సరైన నిష్పత్తిలో ఉండాల్సి ఉన్నందున ఇలా బోగస్‌ పేర్లతో పార్టీ పేరిట నామినేషన్లు దాఖలు చేశారని అనుమానిస్తున్నారు.

సాక్షి, మదనపల్లె: తాను ఎంపీటీసీ అభ్యర్థినంటూ శుక్రవారం మదనపల్లె రూరల్‌ మండలం సీటీఎం–1 స్థానానికి నామినేషన్‌ వేసేందుకు 70 ఏళ్లు పైబడిన ఉత్తమ్మ అనే వృద్ధురాలు మదనపల్లె నామినేషన్‌ కేంద్రానికి ఇద్దరు వ్యక్తుల సాయంతో వచ్చి ఆశ్చర్యానికి గురిచేసింది. ఎంపీటీసీ స్థానం జనరల్‌ మహిళకు కేటాయించడంతో తాను జనసేన తరఫున నామినేషన్‌ వేసేందుకు వచ్చానని ఉత్తమ్మ చెప్పింది. ఇద్దరు సహాయకులు ఆమెను ఆటోలో తీసుకొని మదనపల్లె నామినేషన్‌ కార్యాలయానికి వచ్చారు. ఇది చూసి పలువురు నడవలేని స్థితిలో, నడుము వంగిపోయి, ఇద్దరు సహాయకులతో వచ్చిన ఉత్తమ్మ ఈ వయసులో ప్రజాక్షేత్రంలో పోటీనా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement