డీఐజీ పరిశీలన | - | Sakshi
Sakshi News home page

డీఐజీ పరిశీలన

Oct 24 2026 4:53 AM | Updated on Oct 24 2026 4:53 AM

మదనపల్లె టౌన్‌ : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలోని జెడ్పీటీసీ నామినేషన్ల కేంద్రాన్ని డీఐజీ డాక్టర్‌ కోయ ప్రవీణ్‌ శుక్రవారం పరిశీలించారు. నిమ్మనపల్లి రోడ్డులోని జీఎంఆర్‌ ప్రభుత్వ మోడల్‌ రెసిడెన్షియల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో మూడో రోజు 25 మండలాల నుంచి వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారని.. ఎలాంటి గొడవలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టాలని జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లిని ఆదేశించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐ మధు, ఎస్‌ఐలు రామకృష్ణారెడ్డి, రహీముల్లా, సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రశాంతంగా నామినేషన్లు

మదనపల్లె టౌన్‌ : అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి తెలిపారు. జిల్లాలో మొత్తం 1,458 ఎంపీటీసీ నామినేషన్లు, 252 జెడ్పీటీసీ నామినేషన్లు దాఖలయ్యాయని పేర్కొన్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు, శాంతిభద్రతల సమస్యలు లేకుండా ప్రక్రియ సజావుగా సాగిందన్నారు. వాట్సాప్‌, ఈమెయిల్‌, ఎలక్షన్‌ సెల్‌ ద్వారా 77 ఫిర్యాదులు అందాయని, వాటిపై ఎస్‌హెచ్‌వోలు వెంటనే స్పందించి పరిష్కరించారని తెలిపారు. అందులో 28 మంది అభ్యర్థులకు పోలీసులు దగ్గరుండి సురక్షితంగా నామినేషన్లు వేసేలా ఏర్పాట్లు చేశారన్నారు.

కురబలకోటలో అడ్డంకులు

● వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల వెంట పడిన టీడీపీ గూండాలు

● ఉరుకు పరుగులతో నామినేషన్‌ కేంద్రంలోకి..

కురబలకోట : కురబలకోట మండలంలో నామినేషన్ల పర్వం చివరి రోజు శుక్రవారం ఉత్కంఠ మధ్య సాగింది. పోలీసులు సహకరించినా టీడీపీ శ్రేణులు అడుగడుగునా అడ్డుతగిలారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి నానా తంటాలు పడ్డారు. టీడీపీ శ్రేణుల అడ్డంకులను తప్పించుకుని నామినేషన్‌ కేంద్రానికి చేరుకునే క్రమంలో ఉరుకులు.. పరుగులు పెట్టారు. పిచ్చలవాండ్లపల్లి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దయ్యాల లలితతోపాటు ఆ గ్రామ నాయకులు వసంతరెడ్డి, కేశవరెడ్డి, రెడ్డిశేఖర్‌ రెడ్డి నామినేషన్‌ వేసేందుకు వస్తుండగా టీడీపీ మూకలు ఉన్నపాటున వారి వెంట పడ్డారు. నామినేషన్‌ కేంద్రానికి వెళ్లకుండా అడుగడుగునా అడ్డుతగిలారు. టీడీపీ శ్రేణుల ప్రతిబంధకాలను తప్పించుకుంటూ పరుగు పరుగున నామినేషన్‌ కేంద్రానికి చేరుకున్నారు. భయానక పరిస్థితిలో వారు గసపోసుకుంటూ వచ్చి నామినేషన్‌ వేయడం ఎన్నికల ప్రక్రియలో ఉన్న వారిని సైతం ఆందోళనకు గురిచేసింది. ఇది సినీ సన్నివేశాన్ని తలపింపజేసింది. అప్పటికి కొందరి నామినేషన్‌ పత్రాలను టీడీపీ శ్రేణులు చించివేశారు. నామినేషన్లు స్వేచ్ఛగా వేయడానికి పోలీసులు టీడీపీ శ్రేణులను నిలువరించడానికి లాఠీ చార్జి కూడా చేశారు. ఎట్టకేలకు మండలంలోని 12 స్థానాలకు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement