● నియామకం కానీ సీఈఓ, డిప్యూటీ సీఈవో
● ఉడా ఆఫీసులో జెడ్పీకి చర్యలు
● ప్రత్యేక పాలకుల నియామకంలో జాప్యం
సాక్షి, మదనపల్లె : ఈనెల 25 (శుక్రవారం) నుంచి కొత్త జిల్లాల జిల్లా ప్రజా పరిషత్తుల పరిపాలన ప్రారంభం కావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో అన్నమయ్య జిల్లా ఒకటి. అయితే గురువారం రాత్రి వరకు జిల్లా పరిషత్ ఏర్పాటుకు సంబంధించిన చర్యలు ఒక్కటి కూడా ప్రభుత్వం చేపట్టలేదు.దీంతో జిల్లా పరిషత్ పాలన ప్రారంభం కావడానికి ఇంకా ఆలస్యం అవుతోంది. నిర్ణయించిన మేరకు జిల్లా పరిషత్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఇప్పటిదాకా ఒక్క పని కూడా ప్రారంభం లేదు. కనీసం జిల్లా ప్రజా పరిషత్ సీఈవో, డిప్యూటీ సీఈఓలను ప్రభుత్వం నియమించలేదు. అవసరమైన విభాగాల అధికారులు, ఉద్యోగుల కేటాయింపు కూడా జరగలేదు.
27 మందికి ప్రతిపాదన
మదనపల్లె జిల్లా ప్రజా పరిషత్ ఏర్పాటు కోసం ఉమ్మడి చిత్తూరులోని 27 మంది ఉద్యోగులను ఇక్కడికి పంపేందుకు చిత్తూరు కలెక్టర్ కు ప్రతిపాదన పంపించారు. దీనికి ఆమోదం లభిస్తే 27 మంది ఉద్యోగులు చిత్తూరు నుంచి మదనపల్లెకు వస్తారు. దీనిపై గురువారం రాత్రి దాకా చిత్తూరు కలెక్టర్ ఆమోదం తెలపలేదని సమాచారం. మదనపల్లెలో జిల్లా ప్రజా పరిషత్ ఏర్పాటు కోసం మొదట పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు. అయితే దీనిపై అధికారులు వెనకడుగు వేశారు. ప్రస్తుతం అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయ భవనాన్ని జిల్లా పరిషత్ కోసం వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని చిత్తూరు జడ్పీ సీఈవో కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గతంలో ఈ కార్యాలయం జడ్పీ అతిథి గృహంగా ఉండేది. తర్వాత పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంగా మార్చారు. ఈ భవనం జిల్లా పరిషత్ కు సంబంధించింది అని పట్టణాభివృద్ధి సంస్థ నుంచి తమకు అప్పగిస్తే సీఈఓ కార్యాలయం ఏర్పాటు చేసుకుంటామని కలెక్టర్ కు నివేదించారు. దీనిపై కలెక్టర్ నుంచి ఆమోదం లభించాల్సి ఉంది.
ప్రత్యేక పాలనకు జాప్యం
జిల్లాలోని 25 మండలాల ప్రజా పరిషత్ పాలకవర్గ పదవీకాలం ఈనెల 23తో ముగిసింది. వీరి స్థానంలో మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలో 25 మంది ప్రత్యేక అధికారులను నియమించాల్సి ఉంది. పాలకవర్గ పదవీకాలం ముగిసే రెండు రోజులు గడిచినప్పటికీ ఇంకా వారి నియామకం జరగలేదు.


