బతుకుతెరువుకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు | - | Sakshi
Sakshi News home page

బతుకుతెరువుకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు

Sep 25 2026 12:29 AM | Updated on Sep 25 2026 12:29 AM

● ఒకే వీధికి చెందిన ఇద్దరిని బలిగొన్న రోడ్డు ప్రమాదం

● కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు

ప్రొద్దుటూరు క్రైం : బతుకుబండి లాగేందుకు నిత్యం శ్రమించే ఆ ఇద్దరూ గురువారం కూడా తమ పనిమీద బయలుదేరారు. రాళ్లను ట్రాక్టర్‌లో తీసుకెళ్లి విక్రయించి తిరిగి వస్తారనుకున్న కుటుంబ సభ్యులకు అంతలోనే తీరని విషాదం ఎదురైంది. బద్వేల్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రొద్దుటూరు మండలంలోని చౌడూరు గ్రామానికి చెందిన పట్నం భాస్కర్‌, తలసరి రమణయ్య దుర్మరణం చెందడంతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. ఒకే వీధిలో నివసించే ఇద్దరూ ఒకే ప్రమాదంలో మృత్యువాత పడటంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరయ్యాయి. పట్నం భాస్కర్‌కు గ్రామ శివారులో ఎకరం చౌడు భూమి ఉంది. సొంతంగా ట్రాక్టర్‌ ఉండటంతో సమీపంలోని గనుల నుంచి రాళ్లను తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సాధారణంగా రాళ్లను విక్రయించేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తనతో పాటు అదే వీధిలో నివసించే రమణ్యను కూడా తీసుకెళ్లేవాడు. ఎప్పటిలాగే గురువారం కూడా రమణయ్యను వెంటబెట్టుకొని రాళ్ల లోడుతో బద్వేల్‌ వైపు బయలుదేరాడు.

పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు

భాస్కర్‌ మృతితో భార్య మునిలక్షుమ్మ, కుమారుడు వెంకటపవన్‌, కుమార్తె వెంకటసువర్ణ విషాదంలో మునిగిపోయారు. కుమార్తెకు ఇప్పటికే వివాహం కాగా, కుమారుడు పవన్‌ గ్రామంలోనే నెట్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. కుటుంబానికి ఆధారంగా ఉన్న భాస్కర్‌ ఒక్కసారిగా దూరం కావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మరోవైపు రమణయ్య మృతితో భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు వెంకటశివుడు, కుమార్తె శివలలిత తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పిల్లలిద్దరికీ వివాహాలు కావడంతో వారి కుటుంబ బాధ్యతలు కొంత తీరిన సమయంలో రమణయ్య మృత్యువాత పడటం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది.

చౌడూరులో విషాదచాయలు..

ఒకే వీధిలో నివసిస్తూ, బతుకుతెరువు కోసం కలసి ప్రయాణించే ఇద్దరూ ఇక లేరన్న వార్త చౌడూరు గ్రామస్తులను, మృతుల సన్నిహితులను కలచివేసింది. పోస్టుమార్టం అనంతరం గురువారం సాయంత్రం ఇరువురి మృతదేహాలను గ్రామానికి తీసుకురావడంతో విషాద వాతావరణం నెలకొంది. తమతో కలిసి నిత్యం కనిపించే ఇద్దరు ఇక కనిపించరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement