యువకుడిపై కత్తితో దాడి | - | Sakshi
Sakshi News home page

యువకుడిపై కత్తితో దాడి

Sep 25 2026 12:29 AM | Updated on Sep 25 2026 12:29 AM

నిమ్మనపల్లె(మదనపల్లె టౌన్‌) : యువకుడి పై కత్తితో దాడి చేసిన సంఘటన నిమ్మనపల్లె మండలంలో గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నిమ్మనపల్లె మండలంలోని పిట్టావాండ్లపల్లిలో నివాసం ఉంటున్న సుబ్రహ్మణ్యం (38) పెయింటర్‌ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన మరదలు రాయని చెరువు వడ్డేపల్లి నుంచి అలిగి వచ్చేయడంతో, ఆమెను కాపురానికి పిలుచుకొని వెళ్లడానికి గోవర్ధన్‌ వచ్చాడు. భార్యను సరిగా చూసుకోవడం లేదని సుబ్రమణ్యం మండిపడుతూ గోవర్ధన నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన గోవర్ధన్‌ ఇంట్లో ఉన్న కత్తితో సుబ్రహ్మణ్యం పై దాడి చేశాడు. గాయపడిన బాధితుడిని వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. నిమ్మనపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆక్రమణపై పోలీసులకు ఫిర్యాదు

సంబేపల్లె : మండల పరిధిలోని ఎస్‌.సోమవరం గ్రామం దేవళంపేట సమీపంలోని దర్గా, మసీదులకు కేటాయించిన ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన ముబారక్‌బాషా ఆక్రమించినట్లు మసీదు ప్రెసిడెంట్‌ షేక్‌ జిలానీ బాషా గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మసీదులకు కేటాయించిన భూమిలో ముబారక్‌ ట్రాక్టర్‌తో దున్ని ఉలవలు చల్లి ఆక్రమించుకున్నట్లు, ఆక్రమించిన స్థలంలో జెండా మాను ఉందని వివరించారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడాలని కొరారు.

వ్యక్తి ఆత్మహత్య

తంబళ్లపల్లె : ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం మండలంలో జరిగింది. ఎస్‌.ఐ అనిల్‌కుమార్‌ కథనం మేరకు గంగిరెడ్డిపల్లె పంచాయతీ రేకులకుంటతాండాకు చెందిన ఎం.గోపాల్‌నాయక్‌ (44)వ్యవసాయ కూలీ పనులు చేస్తూ భార్య,ఇద్దరు పిల్లలను పోషించేవాడు. మద్యానికి బానిస కావడంతో బుధవారం రాత్రి ఇంట్లోని గదిలో పడుకున్న గోపాల్‌నాయక్‌ గురువారం బయటకు రాకపోవడంతో కుటుంబుసభ్యులు కిటికిలో నుంచి చూశారు. ఉరికి వేలాడుతుండటం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.

జూదరుల అరెస్టు

పీలేరురూరల్‌ : ఎనిమిది మంది జూదరులను అరెస్ట్‌ చేసిచేసినట్లు ఎస్‌ఐ లోకేష్‌ తెలిపారు. గురువారం సాయంత్రం పీలేరు పట్టణంలోని ఎల్‌బీఎస్‌ రోడ్డు లో ఎస్వీ మహల్‌ సమీపంలో అండర్‌ గ్రౌండ్‌లో ఉన్న శ్రీ షిరిడి జిరాక్స్‌ సెంటర్‌లో పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ తన సిబ్బందితో దాడి చేశారు. ఈ సందర్భంగా ఎనిమిది మంది జూదరులను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ. 15,260 నగదు, ఏడు సెల్‌ఫోన్లు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement