కడప సిటీ : దేవునికడపలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా గురువారం వివిధ పూజాధి కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా పవిత్ర సమర్పణ, హోమాలు నిర్వహించారు. యాగశాలలో శాస్త్రోక్తంగా హోమాలు, జపాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉత్సవ మూర్తులను ఊరేగించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే నిత్య పూజలు, ఉత్సవాల్లో భక్తులు, అర్చకుల ద్వారా తెలిసి తెలియక జరిగే లోపాలు, అపచారాలు ఉంటాయి. అశౌచ దోషాల నివారణకు ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. శుక్రవారం పూర్ణాహుతి, చక్రస్నానం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీంతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
అరుణాచలానికి ప్రత్యేక సర్వీసు
కడప కోటిరెడ్డిసర్కిల్ : పరాభవ నామ సంవత్సర భాద్రపద పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచలానికి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ కడప డిపో మేనేజర్ ఆర్‌సీ నిరంజన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 26వ తేది ఉదయం 9 గంటలకు కడప ఆర్టీసీ బస్టాండు నుంచి ఒక బస్సు, రాయచోటి బంగ్లా బస్టాండు నుంచి ఉదయం 10.15 గంటలకు మరో బస్సు బయలుదేరుతుందన్నారు. ఈ బస్సులో ఛార్జి కేవలం రూ. 1050గా నిర్ణయించారన్నారు. వివరాలకు 9959225774, 9494755057, 9440449559 నెంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
జిల్లాలో విస్తారంగా వర్షాలు
కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలో నాలుగు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉద్యాన పంటలతోపాటు వ్యవసాయ పంటలు జీవం పోసుకున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు జిల్లావ్యాప్తంగా వర్షం కురిసింది. కొండాపురం మండలంలో అత్యధికంగా 32.6 మి.మీ వర్షం కురిసింది. అలాగే చెన్నూరు మండలంలో 31.2, సింహాద్రిపురంలో 25.2, పులివెందుల, జమ్మలమడుగులలో 17.6, ప్రొద్దుటూరులో 16.6, సిద్దవటంలో 15.6, చాపాడులో 14.4, వేంపల్లి, లింగాలలో 14, మైదుకూరులో 13, ఖాజీపేటలో 12.8, కడపలో 12.6, కాశినాయనలో 12.2, బి.మఠంలో 12, పెద్దముడియలో 11.8, తొండూరులో 10.4, ఒంటిమిట్ట, వల్లూరులలో 9.8 ,సికెదిన్నె 9.6, ముద్దనూరు, చక్రాయపేటలో 9.2, మైలవరంలో 9, వీఎన్‌పల్లిలో 8.8, కలసపాడులో 8.6, పోరుమామిళ్లలో 8.2, బద్వే ల్, వీరబల్లిలో 7.2, అట్లూరులో 6.4, నంద లూరులో 5.6, బి.కోడూరులో 5, రాజంపేటలో 4.6, కమలాపురంలో 4.4, గోపవరంలో 3.6, పెండ్లిమర్రి, టి. సుండుపల్లిలలో 3.2, వేములలో 3 మి.మీ వర్షం కురిసింది.
నేడు జిల్లాస్థాయి ఎంపికలు
కడప ఎడ్యుకేషన్: కడప డీఎస్‌ఏ క్రీడా మైదానంలో శుక్రవారం ఉషూ, బాక్సింగ్, జూడో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శులు విజయలక్ష్మి, నాగరాజురెడ్డి తెలిపారు. అలాగే చెన్నూరు మండలం రామనపల్లె బాలబాలికలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గట్కా అండర్ 17 ఎంపికలు జరుగుతాయని వివరించారు. క్రీడాకారులందరూ 25వ తేదీ ఉదయం 9 గంటలకు స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డుతో హాజరుకావాలని సూచించారు.
వైవీయూలో
పీజీ ప్రవేశాలు ప్రారంభం
కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ పీజీ సెట్)–2026 అర్హత సాధించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. రామకృష్ణ పర్యవేక్షణలో విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించారు. మొదటి విడతలో 303 మంది విద్యార్థులు యోగి వేమన విశ్వవిద్యాలయ క్యాంపస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాలను కోరుకోగా వారికి తొలిరోజు వెరిఫికేషన్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ అర్హత పత్రాల పరిశీలన ఈనెల 29వ తేదీ వర కు ఉంటుందని తెలిపారు. విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ అలాట్మెంట్ లెటర్ రెండు కాపీలు, అర్హత పత్రాల రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, రెండు ఫొటోలు తీసుకురావాలన్నారు.


