వాల్మీకిపురం : టైరు పంచర్ కావడంతో ఆర్టీసీ బస్సు బోల్తా పడి 20 మంది తీవ్రంగా గాయపడిన సంఘటన మండల పరిధి విఠలం సమీపంలోని మదనపల్లె – తిరుపతి జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. మదనపల్లె– 2 డిపోకు చెందిన మదనపల్లె – తిరుపతి నాన్‌స్టాప్ ఆర్టీసీ బస్సు మదనపల్లె నుంచి ప్రయాణికులతో ఉదయం 11 గంటల సమయంలో తిరుపతికి బయల్దేరింది. మార్గమధ్యంలోని వాల్మీకిపురం మండలం విఠలం వద్ద ముందు టైరు పంచర్ కావడంతో పక్కనే ఉన్న చిన్నపాటి కల్వర్టు వద్ద బస్సు బోల్తా కొట్టింది. ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ వెంకటేశ్వర రాజుకు చేయి విరిగిపోగా, మదనపల్లికు చెందిన ప్రయాణికుడు మోహన్ రామిరెడ్డి (55) కాలు విరిగింది. ప్రయాణికులు మునిరెడ్డి, అంజనీకుమారి, శ్రీనివాసులు తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ వెంకటేశ్వర రాజు చాకచక్యంగా బస్సును అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. క్షత్రగాత్రులను 108 వాహనంలో హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


