గుర్రంకొండ : 10 బోర్ల వద్ద 250 మీటర్ల బోరు మోటారు కేబుల్‌ను దుండగులు చోరీ చేసిన సంఘటన మండలంలోని మర్రిపాడు పంచాయతీలో జరిగింది. ఒక్కరోజులోనే చాలా బోర్ల వద్ద కేబుల్ కత్తిరించి వేయడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మర్రిపాడు గ్రామ కస్పా పరిసరాల్లోని పొలాల వద్ద గత రాత్రి కేబుల్ వైర్లు చోరీ ముఠా సభ్యులు 10 మంది రైతులకు చెందిన పొలాల వద్ద ఉన్న బోర్లకు అమర్చిన కేబుల్‌ను కత్తిరించారు. ఒక్కో బోరు మోటారు నుంచి పది నుంచి 12 మీటర్ల మేర కేబుల్ కత్తిరించుకుకొని తీసుకెళ్లిపోయారు. మంగళవారం ఉదయాన్నే పొలాల వద్దకు బోరుమోటారు ఆన్‌చేయడానికి వెళ్లిన రైతులకు కేబుల్ కత్తిరించేసిన దృశ్యాలు కనిపించాయి. బోరుమోటారు స్ట్రాటరు నుంచి బోరులోపల మోటారుకు ఆమర్చిన ప్రదేశం వరకు ఉన్న కేబుల్‌ను దుండగులు కత్తిరించి అపహరించారు. దీంతో మోటార్లు పనిచేయక మెకానిక్‌ల వద్దకు రైతులు పరుగులు తీశారు. కొత్తగా బోరుకేబుల్ అమర్చాలంటే ఒక బోరుకు రూ. 4 వేల నుంచి రూ. 5 వేల వరకు ఖర్చు వస్తుందని ఆవేదన చెందుతున్నారు. అన్ని బోర్ల వద్ద చోరీకి గురైన కేబుల్ 250 మీటర్ల వరకు ఉంటుందని రైతులు తెలిపారు. దీంతో పొలాలకు నీరుపెట్టుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజులుగా మండలంలోని పలు గ్రామాల్లోని 105 మంది రైతుల పొలాల్లో కేబుల్ చోరీ ముఠా కేబుల్‌ను అపహరించడం గమనార్హం.


