బైరెడ్డిపల్లె : ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు అబద్ధాలను అస్త్రంగా వాడుకుంటున్నారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విమర్శించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లెలో మంగళవారం ఆయన వైఎస్సార్‌సీపీ నాయకులతో మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించాలన్నారు. రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ మహిళలకు పింఛన్, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు రూ.1500 ఇస్తామని మోసం చేశారన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామన్న హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ప్రజల్లో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, దీంతో కొత్త పింఛన్లు ఇస్తున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. గత ప్రభుత్వంలో వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ఇంటి వద్దనే అర్హులను గుర్తించి పింఛన్లు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన పింఛన్లను చంద్రబాబు ప్రభుత్వంలో తొలగించారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పైబడుతున్నా ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదన్నారు. చంద్రబాబు మోసాలపై గెలవాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ కార్యదర్శి బైరెడ్డిపల్లె క్రిష్ణమూర్తి, కో ఆప్షన్ సభ్యుడు పైజుల్లాసాబ్, రెడ్డీవీనస్, వెంకట్‌తేజ, పీరూసాబ్ పాల్గొన్నారు.


