కలికిరి : రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. మండలంలోని పల్లవోలు గ్రామం ద్వారకానరగ్‌కు చెందిన గుర్రంకొండ యల్లయ్య (43) ఈ నెల 19న సొంత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై తిరుపతికి వెళ్లారు. అదే రోజు తిరుగు ప్రయాణంలో రాత్రి 9 గంటల సమయంలో తిరుపతి–మదనపల్లి జాతీయ రహదారి కలికిర మండలం పత్తేగడ గ్రామం బెస్తపల్లి వద్ద మదనపల్లి వైపు నుంచి ఎదురుగా వచ్చిన బొలోరో వాహనం యల్లయ్య ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో యల్లయ్యకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు తిరుపతిలోకి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం యల్లయ్య మృతి చెందాడు. మృతుడి భార్య ఉష ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్ రామచంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించి, పోస్టు మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మాజీ ఎమ్మెల్యే పరామర్శ..
మండలంలోని పల్లవోలు గ్రామం ద్వారకానరగ్‌కు చెందిన గుర్రంకొండ యల్లయ్య మృతి సమాచారం తెలుసుకున్న పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి రుయా ఆసుపత్రికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోస్టుమార్టం ప్రక్రియ త్వరితగతిన జరిగేలా వైద్యులతో మాట్లాడి చర్యలు తీసుకున్నారు.


