● కలెక్టరేట్‌కు పోటెత్తిన అర్జీదారులు
● అర్జీలు కోకొల్లలు..
పరిష్కారం నేలచూపులు
మదనపల్లె (కురబలకోట): మదనపల్లె కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం జరిగింది. వివిధ సమస్యలతో జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు వచ్చారు. ప్రతి సోమవారం అర్జీలు తీసుకోవడం, రశీదులు ఇవ్వడం తప్ప పరిష్కారం శాతం చాలా తక్కువగా ఉందని వాపోతున్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పీజీఆర్‌ఎస్ వ్యవహారం ఉంటోందని మదనపడుతున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన పీజీఆర్‌ఎస్ ఆచరణలో మాత్రం అర్జీల స్వీకరణ కేంద్రంగానే మిగిలిపోతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండల కార్యాలయాల్లో పరిష్కారం కాక జిల్లా కేంధ్రం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌కు వస్తే ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎదురవుతుండడంతో తమ గోడు ఇక ఎవరికి చెప్పుకోవాలని అసహనం వ్యక్తం చేస్తున్నారు. భూవివాదాలు, ఫించన్లు, భూ కబ్జాలు, తాగునీటి సమస్యలపై ఎక్కువగా అర్జీలు వచ్చాయి. పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లో 467 అర్జీలు రాగా వాటిపై తగు చర్యలు తీసుకుని వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఆదేశించారు.
భూ ఆక్రమణలపై విచారణ జరపాలి
కేవీవి పల్లి మండలంలో దళిత కుటుంబాలకు కేటాయించిన భూముల్లో ఇళ్ల నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పుడు అదే స్థాయిలో ప్రభుత్వ భూములు, చెరువులు, శ్మశాన వాటికల ఆక్రమణలపై ఎందుకు చర్యలు తీసుకోడవం లేదని మాదిగ దళ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ముల్లంగి చంద్రయ్య తదితరులు ప్రశ్నించారు. వివిధ భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపాలని పీజీఆర్‌ఎస్‌లో జిల్లా కలెక్టర్‌ను కోరారు.
రీసర్వే మళ్లీ నిర్వహించాలి
కురబలకోట మండలంలోని మట్లివారిపల్లి గ్రామంలో రీసర్వేలో అవకతవకలు జరిగాయని తిరిగి సర్వే నిర్వహించాలని ఆ గ్రామ రైతులు ఫిర్యాదు చేశారు. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లుగా సర్వే నిర్వహించి ఒకరి భూములు మరొకరికి నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రీసర్వే అవకతవకలు చోటుచేసుకున్నాయని మళ్లీ సర్వే నిర్వహించి రైతులకు న్యాయం చేయాలని కోరారు
భూమిని ఆక్రమించుకున్నారు
కలికిరి మండలం కొత్తపల్లిలో ఎవరూ లేని వారి ఎకరానికిపైగా ఉన్న కోటి 50లక్షలు విలువ చేసే భూమిని మరొకరు ఫేక్ డాక్యుమెంట్లతో ఆక్రమించారని పీజీఆర్‌ఎస్‌లో ఆ గ్రామానికి చెందిన సునీల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.సదరు భూమి యజమానులు, వారి వారసులు చనిపోయారని, తప్పుడు పత్రాలతో అక్రమ మార్గంలో పొందిన ఆ భూమిని స్వాధీనం చేసుకుని ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించుకోవడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.


