సాక్షి, మదనపల్లె: గురజాడ అప్పారావు సమాజ సంస్కర్త అని కలెక్టర్ నిశాంత్‌కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో గురజాడ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక తెలుగు సాహిత్య యుగకర్తగా, ప్రముఖ సంఘ సంస్కర్తగా, మహాకవిగా గుర్తింపు పొందారని తెలిపారు.గురజాడ రచించిన ‘కన్యాశుల్కం’ నాటకం తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయిగా నిలిచిందన్నారు. బాల్యవివాహాలు, కన్యాశుల్కం వంటి సామాజిక దురాచారాలను ఆయన తన రచనల ద్వారా ప్రశ్నించారని తెలిపారు. ప్రజలకు అర్థమయ్యే వ్యావహారిక భాషలో రచనలు చేసి తెలుగు భాష అభివృద్ధికి విశేష కృషి చేశారని అన్నారు. సమాజ శ్రేయస్సు, సీ్త్ర విద్య, మానవతా విలువల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. సబ్‌కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్‌ఓ వెంకటేష్, డీటీఓ నాగభూషణం, యువజన అధికారి వీవీ నారాయణ పాల్గొన్నారు.
● నులిపురుగుల నిర్మూలన దినోత్సవం, ప్రపంచ పాముకాటు అవగాహన వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో రక్తహీనత నివారించేందుకు నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
విద్యా ప్రమాణాలు..హాజరు పెరగాలి
మదనపల్లె (కురబలకోట): మానవ వనరుల అభివృద్ధికి సంబంధించిన శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి వంద శాతం లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌లో పాఠశాల విద్య, ఐసీడీఎస్, ఎస్సీ, ఎస్టీ,మైనారిటీ, బీసీ సంక్షేమం, నైపుణ్యాభివృద్ది సంస్థ శాఖల పనితీరుపై సమీక్షించారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెరగడంతో పాటు పదో తరగతి, ఇంటర్ ఫలితాల మెరుగుదలకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. శిధిల భవనాలను తొలగించి మౌళిక వసతుల పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం ఈ నెల 25న పీలేరులో నిర్వహించే జాబ్‌మేళా ప్రచార పోస్టర్‌ను అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
కలెక్టర్ నిశాంత్‌కుమార్


