ప్రత్యామ్నాయం మిథ్యేనా ! | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయం మిథ్యేనా !

Sep 22 2026 12:24 AM | Updated on Sep 22 2026 12:24 AM

జిల్లాలో 25 శాతానికే పరిమితమైన ఖరీఫ్‌ సాగు

వర్షాలు లేక దుర్భిక్ష పరిస్థితులు

జిల్లాలో 9 వేల క్వింటాళ్ల

ఉలవల పంపిణీ

సాక్షి, మదనపల్లె: ఎల్లోనినో ప్రభావంతో ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు పడకేసింది. జిల్లా వ్యాప్తంగా కేవలం 25% విస్తీర్ణంలోనే పంటలు సాగు అయ్యాయి. 46,0 55 హెక్టార్లలో అన్ని పంటలు సాగు కావాల్సి ఉండగా, కేవలం 11873 హెక్టార్లలో సాగు అయ్యాయి. ఈ సాగు విస్తీర్ణం గత పదేళ్లలో ఇంత దారుణంగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ రైతుల కోసం ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలు చేసింది.

9 వేల క్వింటాళ్ల ఉలవలు

జిల్లాలో తక్కువ నీటితో సాగు చేసే ఉలవలను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. ఖరీఫ్‌లో వేరుశనగ విత్తన కాయలు పంపిణీ చేసినా చినుకు లేక సాగుకు నోచుకోలేదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉలవలను పంపిణీ చేసి వాటి సాగు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. జిల్లా రైతాంగానికి పది వేల క్వింటాళ్ల ఉలవలు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదించగా 9,990 క్వింటాళ్ల ఉలవలను కేటాయించారు. వీటిలో ఇప్పటిదాకా జిల్లాకు 9,219 క్వింటాళ్ల ఉలవలు వచ్చాయి. జిల్లాలోని 25 మండలాలకు పంపించారు.

ఆర్బీకేల ద్వారా పంపిణీ

ఉలవలను రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ అధికారులు పంపిణీ చేపట్టారు 10, 20 కిలోల బ్యాగులను రైతులకు అందిస్తున్నారు. కిలో ఉలవ ధర రూ.70 అయితే రాయితీపోగా రైతు నుంచి రూ.14.8 వసూలు చేస్తున్నారు. రైతు పాసు పుస్తకాల్లో నమోదైన భూ విస్తీర్ణం బట్టి వీటిని మంజూరు చేస్తారు. రైతులు పాసుపుస్తకం, ఆధార్‌ కార్డు రైతు భరోసా కేంద్రాలకు తీసుకెళితే అక్కడ ఆన్‌లైన్లో నమోదు చేస్తారు. సంబంధిత రైతు ఫోన్‌కు ఓటీపీ రాగానే ఆ నంబర్‌ ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయ్యాక ఉలవలను అందజేస్తారు.

ఖరీఫ్‌ సాగు కాలేదని ఉలవలను ప్రత్యామ్నాయంగా రైతులు సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. జూన్‌ నెల రెండో వారం నుంచి గత శనివారం వరకు జిల్లా వ్యాప్తంగా వర్షాల జాడలేదు. తాగునీటికి కూడా సమస్య ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో శనివారం రాత్రి ఓ మోస్తారుగా కురిసిన వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయి. అయితే ఎల్లోనినో ప్రభావం ఇంకా కొనసాగుతూ ఉండడంతో వర్షాలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. పరిస్థితుల్లో రైతులు ఉలవలను కొనుగోలు చేసిన సాగు చేసేందుకు సిద్ధపడతారా అనేది అనుమానమే. ఈ పంటకు పెద్దగా నీటి అవసరం లేనందున రైతులు సాగు చేసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. వర్షాలు అడపాదడపా కురుస్తూ ఉంటే ఉలవ పంట ద్వారా రైతులు మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంది. ఈ పంటైనా చేతికందితే రైతులకు కొంతమేర ఆదాయం లభించి ఊరట చెందుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement