యువత.. దారి తప్పుతున్న భవిత | - | Sakshi
Sakshi News home page

యువత.. దారి తప్పుతున్న భవిత

Sep 21 2026 6:29 AM | Updated on Sep 21 2026 6:29 AM

యువత.. దారి తప్పుతున్న భవిత

తప్పతాగి తూలుతున్న మైనర్లు

క్రికెట్‌ బెట్టింగ్‌తో కుదేలు

ట్రాఫిక్‌ విషయమై సర్దిచెప్పేందుకు వచ్చిన వ్యక్తిపై కర్రతో దాడి చేస్తున్న యువకుడు (ఫైల్‌)

తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం

ఇటీవల జరిగిన ఘటనలు పరిశీలిస్తే చిన్న చిన్న కారణాలకే యువకులు గొడవ పడతున్నారు. క్షణికావేశంలో వారు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఉన్నారు. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ చాలా అవసరం. ఈ వయసులో వారిని సరైన దారిలో పెట్టకుంటే రానున్న రోజుల్లో ఎవరి మాట వినరు. రాత్రి పొద్దుపోయి ఇంటికి వస్తున్న పిల్లలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలి. ఆ సమయంలో వారు ఎక్కడ తిరుగుతున్నారో అడగాలి. గొడవలు పడి కేసుల్లో ఎరుక్కున్న వారికి భవిష్యత్తులో ఉద్యోగాలు రావు.

– వంశీనాథ్‌,

టూ టౌన్‌ సీఐ, ప్రొద్దుటూరు

కష్టపడ్డా ఆశించినంత డబ్బు రాలేదని..

దొంగగా మారాడు

వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని పెన్నానగర్‌కు చెందిన ఓ యువకుడు ఇంటర్‌ వరకు చదువుకున్నాడు. కుటుంబ పోషణ కోసం డెలివరీ బాయ్‌గా ఉద్యోగంలో చేరాడు. డెలివరీ బాయ్‌గా ఎన్ని రోజులు పని చేసినా వచ్చే డబ్బుతో అతనికి సంతృప్తి కలగలేదు. ఈ క్రమంలోనే అతను చెడు వ్యసనాలకు లోనయ్యాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ప్రొద్దుటూరుతోపాటు పలు ప్రాంతాల్లోని నిర్మానుష్య, జనసంచారం లేని ప్రాంతాల్లో పార్క్‌ చేసిన బైక్‌లను చోరీలు చేయసాగాడు. ఆరు నెలల్లోనే అతను 10 చోట్ల బైక్‌లను దొంగలించాడు. ఈ క్రమంలోనే ప్రొద్దుటూరులో చోరీ చేస్తుండగా ఇటీవల పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి ఏడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

● జల్సాలకు అలవాటు పడ్డ ఇద్దరు అమృతానగర్‌కు చెందిన యువకులు కొన్ని రోజుల క్రితం పట్టణ శివారులోని ఇందిరానగర్‌లో ఉన్న ఆలయంలో చోరీ చేశారు. ఆలయంలోని డబ్బుతోపాటు విగ్రహాన్ని దొంగలించిన వీరిని రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

● ప్రొద్దుటూరు ఎకై ్సజ్‌ పోలీసులు ఇటీవల వేర్వేరు ఘటనల్లో గంజాయి విక్రయిస్తున్న పలువురిని అరెస్ట్‌ చేశారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు, యువకులు గంజాయి విక్రేత లుగా ఉండటం ఆందోళన కలిగించే విషయం.

ప్రొద్దుటూరు క్రైం : చదువుకోవాల్సిన వయసు.. భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన సమయం.. జీవితంలో స్థిరపడేందుకు లక్ష్యాలను ఏర్పరుచుకోవాల్సిన దశ.. కానీ కొందరు యువత ఆ దిశగా కాకుండా జల్సాలు, వ్యవసనాలు, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలతో అడ్డదారులు తొక్కుతున్నారు. గంజాయి, క్రికెట్‌ బెట్టింగ్‌, మద్యం, ఆన్‌లైన్‌ వ్యవహారాలు, బెదిరింపులు, చోరీలకు పాల్పడుతూ.. చివరికి నకిలీ పోలీసుల అవతారం ఎత్తే స్థాయికి కొందరు దిగజారారు. ఇటీవల పోలీసులకు పట్టుబడుతున్న పలు కేసులను పరిశీలిస్తే విద్యార్థులు, యువకుల ప్రమేయం కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.

పోలీసులమంటూ ప్రేమిలకులకు బెదిరింపులు

జల్సాలకు డబ్బులు అవసరం కావడంతో కొందరు యువకులు ఏకంగా నకిలీ పోలీసుల అవతారం ఎత్తుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమికులను లక్ష్యంగా చేసుకొని తాము పోలీసులమని చెప్పడం.. వారిని బెదిరించడం.. వారి నుంచి నగదు, ఖరీదైన మొబైల్‌ ఫోన్లు తీసుకోవడం వంటి వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవల పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు నకిలీ పోలీసులను ప్రొద్దుటూరు రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సాధారణంగా పోలీసులంటే ప్రజలకు రక్షణ కల్పించే వ్యవస్థగా భావిస్తారు. అలాంటి పోలీసుల పేరునే అడ్డుపెట్టుకొని బెదిరింపులకు పాల్పడటం యువతలో కొందరు ఎంతటి అడ్డదారులు తొక్కుతున్నారో తెలియజేస్తోంది.

చదువు అటకెక్కించి.. జల్సాలకు అలవాటు

గంజాయి, మద్యం మత్తులో నేరాల బాట

కేసుల్లో ఇరుక్కుంటున్న వైనం

యువత దారి తప్పడానికి మరో ప్రధాన కారణం మద్యం. మైనర్లకు మద్యం విక్రయించకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు వ్యాపారులు వాటిని పట్టించుకోవడం లేదు. 15–16 ఏళ్ల పిల్లలు మద్యం కోసం దుకాణాలకు వెళ్తే వ్యాపారులు వయసును పరిగణనలోకి తీసుకోకుండా వాళ్లకు మద్యం విక్రయిస్తున్నారు. మైనర్లకు మద్యం విక్రయించకుండా మద్యం షాపుల్లోనే నియంత్రిస్తే.. కొంత వరకు మద్యం అలవాటు నుంచి మైనర్లను దూరం చేయవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

క్రికెట్‌ బెట్టింగ్‌, ఆన్‌లైన్‌ మట్కా కూడా యువతను మరో ఉచ్చులోకి లాగుతోంది. ఒకప్పుడు కొందరు వ్యక్తులు, డబ్బున్న వర్గాలకు పరిమితమైన బెట్టింగ్‌ వ్యవహారాలు ఇప్పుడు కొత్త తరానికి చేరుతున్నాయి. డిగ్రీ, ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థులతో పాటు సాఫ్ట్‌వేర్‌ తదితర ఉద్యోగాలు చేస్తున్న కొందరు కూడా బెట్టింగ్‌ కార్యకలాపాల్లోకి అడుగుపెడుతున్నారు. చెడు సావాసాల బారిన పడి ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా బీరువాల్లోని డబ్బును ఊడ్చేస్తున్నారు. తమ పిల్లలు బెట్టింగ్‌లో చిక్కుకున్న విషయం బయటికి తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో తల్లిదండ్రులు గుట్టుచప్పుడు కాకుండా బాకీలు తీర్చిన ఘటనలు ప్రొద్దుటూరులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా కుటుంబాలకు తెలియకుండా సాగుతున్న బెట్టింగ్‌ వ్యవహారాలు యువతను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement