● 90 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం
● అయిదుగురు దొంగలు అరెస్టు
పులిచెర్ల(కల్లూరు) : కల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధి పుంగనూరు రోడ్డులోని శ్రీ కృష్ణ నగల దుకాణంలో జూలై 17న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు షాపు తాళాలు పగులగొట్టి సుమారు 314 గ్రాముల బంగారం, 20 కిలోల వెండి ఆభరణాలు అపహరించారు. దీనిపై కేసు నమోదు చేసిన కల్లూరు పోలీసులు, క్లూస్ టీం దర్యాప్తు చేపట్టారు. దీనిపై జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాలతో డీఎస్పీ వెంకటనారాయణ పర్యవేక్షణలో కల్లూరు సీఐ జయరామయ్య, ఎస్సై వెంకటేశ్వర్లు ,ఏఎస్‌ఐ దేవరాజులు రెడ్డి, సిబ్బందితో ప్రత్యేక బ్శందాలను ఏర్పాటు చేశారు. శనివారం పాలసముద్రం మండలం, దీనబంధాపురం వద్ద ఐదుగురు నిందితులను అరెస్టు చేసి చైన్నె, వేలూరులో విక్రయించిన నగలను, మూడు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 90 లక్షలు విలువ చేసే 404 గ్రాముల బంగారం, 17 కిలోల వెండి, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని అంతర్‌రాష్ట్ర నిందితులు దినేష్ (25) పాలసముద్రం, బాలయ్య (34) తిరువళ్ళూరు తమిళనాడు, జగన్, తిరువళ్ళూరు, తమిళనాడు, వసంత కుమార్ (16) తిరువళ్లూరు, తమిళనాడు, నీలాంబరన్ పాలసముద్రంను అరెస్టు చేశారు. దినేష్‌పై 18 దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. కల్లూరు పోలీసులను, ప్రత్యేక బృందాలను ఎస్పీ అభినందించారు.


