చౌడేపల్లె : చౌడేపల్లె–పలమనేరు మార్గంలోని చిట్రెడ్డిపల్లె వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇండియన్ బ్యాంక్ ఉద్యోగి మహేష్ (26), సంతోష్ (23)కు ఆదివారం కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు అంతిమ వీడ్కోలు పలికారు. అందరితో ఆప్యాయంగా ఉండే మహేష్ ఇకలేడని తెలిసిన బ్యాంకు ఖాతాదారులు, మహిళా సంఘాల సభ్యులు, యువత ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చి శోక సంద్రం నడుమ ఘన నివాళులర్పించారు. గోసల కురప్పలకు చెందిన ఏఎన్‌ఎం గంగాభవాని కుమారుడు సంతోష్ మృతిపై దళిత సంఘాల నాయకులు నివాళులర్పించారు. అంతిమ సంస్కారాలకు అంబేడ్కర్ సేవా సమితి వ్యవస్థాపకులు మునస్వామి, మణి, పవన్, వెంకట్రామయ్య ఆధ్వర్యంలో ఆర్థిక చేయూతను అందజేశారు. వారి వెంట దళిత సంఘం నేతలు బ్యాంకు రెడ్డెప్ప, శేఖర్, చెంగళ్రాయప్ప తదితరులున్నారు.


