బోరు మోటార్లు, స్టార్టర్ల కేబుల్ వైర్ల చోరీ...
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి వేళ వ్యవసాయ బోర్లను లక్ష్యంగా చేసుకుని బోర్లకు అమర్చిన స్టార్టర్లు, మోటార్లకు ఉన్న కేబుల్ వైర్లను కత్తిరించుకుపోతున్నారు. జిల్లాలోని కలకడ, యెనుగొండపాళ్యం, సింగనొడ్డిపల్లె, ముడియంవారిపల్లె, పాపిరెడ్డిగారిపల్లె, కదిరాయ చెరువులతో పాటు మదనపల్లె మండలంలోని వెంకప్ప కోట, టిక్కోఇల్లు, చెరువు కిందపల్లె ప్రాంతాల్లో వ్యవసాయ మోటార్లకు సంబంధించిన స్టార్టర్లు, కేబుల్ వైర్లు అర్ధరాత్రి వేళల్లో చోరీకి గురయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు మోటార్ల వద్ద ఏర్పాటు చేసిన స్టార్టర్లను తొలగించడంతో పాటు విద్యుత్ కేబుల్ వైర్లను కోసుకెళ్లినట్లు బాధితులు ఆదివారం తెలిపారు. వెంకప్పకోట, గొల్లపల్లికి చెందిన చంద్రశేఖర్ పొలంలోని మోటార్ వద్ద స్టార్టర్, కేబుల్ వైర్లు శనివారం రాత్రి చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. వెంకప్ప కోట సర్పంచ్ సీనా, జి.శంకర, రాములు, జి.వెంకటరమణ, జి.లచ్చమన్నలకు చెందిన మోటార్ల కేబుల్ వైర్లను సైతం దొంగలు కోసుకెళ్లినట్లు బాధితులు పేర్కొన్నారు. వ్యవసాయ పొలాల్లో మోటార్లకు అమర్చిన విద్యుత్ పరికరాలు, వైర్లను లక్ష్యంగా చేసుకుని వరుసగా చోరీలు జరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చోరీలపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నా ఎస్‌ఐలు కేసులు కట్డం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చోరీలకు పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


