● రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు దుర్మరణం
● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
● మిన్నంటిన బాధితుల ఆర్తనాదాలు
చౌడేపల్లె : చౌడేపల్లె– పలమనేరు మార్గంలోని చిట్రెడ్డిపల్లె వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చౌడేపల్లె ఇండియన్ బ్యాంకులో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న నరేంద్ర, బ్యాంకులో అటెండర్‌గా పని చేస్తున్న కుమ్మరవీధికి చెందిన మహేష్(26)లు కలిసి విధుల నిమిత్తం బైక్‌లో పలమనేరు మార్గం వైపు నుంచి చౌడేపల్లెకు వస్తున్నారు. చౌడేపల్లె మండలం గోసలకురప్పల్లెకు చెందిన శంకర్, గంగాభవాని కుమారుడు సంతోష్(23), అదే గ్రామానికి చెందిన స్నేహితుడు చంద్రశేఖర్‌తో కలిసి బైక్‌పై పలమనేరు మార్గంలోని చిట్రెడ్డిపల్లె వద్ద వెళ్తున్నారు. ఎదురెదురుగా వస్తున్న వీరి బైక్‌లు ఽఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహేహేష్, సంతోష్ అక్కడికక్కడే మృతి చెందారు. నరేంద్ర, చంద్రశేఖర్‌కు తలకు తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితికి చేరుకోవడంతో స్థానికులు 108 సహాయంతో మదనపల్లెకు తరలించారు. నరేంద్రను మెరుగైన వైద్య సేవల నిమిత్తం బెంగళూరుకు తరలించారు.
ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు
ఘటనా స్థలానికి సీఐ సాయిప్రసాద్ వెంటనే వచ్చి పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. బ్యాంకు అసిస్టెంట్ మేనేజరు దేవరాజులుతో సంప్రదించారు. మృతదేహాలను పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆరు నెలల కిందటే వివాహం
దేవుడా నా బిడ్డను తీసుకెళ్ళిపోతివా.. ఇంక మేము ఎలా బతికేది అంటూ.. నీ భార్యకు మేము ఏమని చెప్పేదంటూ మహేష్ తల్లిదండ్రులు వెంకటరమణ, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. చౌడేపల్లె ఇండియన్ బ్యాంకులో అటెండర్‌గా మహేష్ (26) పని చేస్తూ మండల ప్రజలకు సుపరిచితుడు. అందరితో అప్యాయతగా పలకరించే వ్యక్తి బైక్ ప్రమాదంలో దుర్మరణం చెందాడని తెలిసిన ప్రజలు అధిక సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహేష్‌కు ఆరు నెలల కిందటే వివాహం అయింది.
ఒక్కగానొక్క కుమారుడు
నాబిడ్డకు ఏమైంది.. నాకు ఫోన్ చేశారు.. సంతోష్‌కు ప్రమాదం జరిగిందంటూ.. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు.. నాకు చూపివ్వండి.. నేను చూడాలి.. దేవుడా అంటూ సంతోష్ తల్లి గంగాభవానీ ఆర్తనాదాలు కలచివేశాయి. ఆమె పెద్దపంజాణి మండలం రాయలపేట సచివాలయంలో ఏఎన్‌ఎంగా పని చేస్తోంది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ఒక్కగానొక్క కుమారుడు కనుమరుగయ్యాడని చెబుతూ కుంగిపోయింది.


