బొలెరోను ఢీకొన్న లారీ | - | Sakshi
Sakshi News home page

బొలెరోను ఢీకొన్న లారీ

Sep 20 2026 6:36 AM | Updated on Sep 20 2026 6:36 AM

మదనపల్లె టౌన్‌ : టమాటాల లోడ్‌ను కర్ణాటకలోని ములబాగిల్‌ వడ్డిపల్లె మార్కెట్‌లో అన్‌లోడ్‌ చేయడానికి వెళ్లారు. తిరిగి వస్తున్న ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న బొలెరోను ఎదురుగా వస్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాద ఘటన శనివారం తెల్లవారుజామున మదనపల్లె–పుంగనూరు ప్రధాన జాతీయ రహదారిలోని వలసపల్లి క్రిష్ణాపురం వద్ద చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ములకలచెరువు మండలం కాల్వపల్లికి చెందిన మహబూబ్‌బాషా కుమారుడు ముజీబ్‌(24), అదే గ్రామానికి చెందిన మహమ్మద్‌ అలీ కుమారుడు ఇమ్రాన్‌(30) బొలెరో వాహనంలో టమాటాల లోడును తీసుకునేందుకు మదనపల్లి మండలంలోని క్రిష్ణాపురానికి వెళ్లారు. సరుకు లోడ్‌ చేసుకుని ములబాగిల్‌ సమీపంలోని వడ్డిపల్లెలో అన్‌లోడ్‌ చేశారు. అనంతరం మదనపల్లె మీదుగా తిరిగి వస్తుండగా, మార్గంమధ్యలోని పుంగనూరు రోడ్డు జ్యూస్‌ ఫ్యాక్టరీ వద్ద.. ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద తీవ్రతకు బొలెరో వాహనం దెబ్బతినగా, ముజీబ్‌ తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. క్లీనర్‌ ఇమ్రాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో ఇద్దరినీ వెంటనే మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ముజీబ్‌ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన ఇమ్రాన్‌ను ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఉపాధి కోసం టమాటా రవాణా చేస్తూ తిరిగి ఇంటికి చేరుకునేలోపే ముజీబ్‌ ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంపై మదనపల్లె తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యే పరామర్శ

ములకలచెరువు : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్‌.ముజీబ్‌ వైఎస్సార్‌సీపీ మండల ఐటీ వింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న ముజీబ్‌ మృతి చెందడంతో కాలువపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి శనివారం ప్రమాదానికి గురైన ఇద్దరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని బాధితులకు భరోసా కల్పించారు. ముజీబ్‌ మృతదేహాన్ని పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు ఆముదాల మదుసూదన్‌రెడ్డి, మల్లికార్జున, మహబూబ్‌బాషా, యాసీన్‌, రాంబాబు, రెడ్డెం క్రిష్ణారెడ్డి సందర్శించి సంతాపం వ్యక్తం చేశారు.

ఒకరి మృతి, మరొకరికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement