కడప అర్బన్ : కడప నగర శివార్లలోని కడప కేంద్ర కారాగారం, ప్రత్యేక మహిళా కారాగారంలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి.రామ గోపాల్, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్.బాబా ఫకృద్దీన్ తమ సిబ్బందితో ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఖైదీలతో మాట్లాడి కేసుల వివరాలు, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఖైదీలకు అవసరమైన వారికి వీల్ చైర్స్, వాకర్స్, వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. అనంతరం జైలు పరిసరాలను పరిశీలించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రాధాన్యత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి.ముఖేష్ కుమార్, రాయచోటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి నూతనగంటి తేజస్విని, పురుషుల, ప్రత్యేక మహిళ కారాగారాల సూపరింటెండెంట్‌లు వెంకటేశ్వరరావు, కృష్ణవేణితోపాటు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్, పానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటరీలు, ఖైదీలు పాల్గొన్నారు.
శభాష్.. పోలీస్
ఎర్రగుంట్ల : ప్రేమించిన అమ్మాయి చనిపోయిందని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకుని కాపాడారు. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన వీరశేఖర్ కుమారుడు అమరావతి నాగవీరచైతన్య(27) అనే యువకుడు ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఇటీవల తాను ప్రేమించిన అమ్మాయి బైక్ ప్రమాదంలో చనిపోయింది. ఇది జరిగి సుమారు మూడు నెలలు దాటింది. అప్పటి నుంచి ప్రతి రోజు మద్యం తాగి ప్రేమించిన అమ్మాయి లేనప్పుడు తన జీవితం వ్యర్థమని భావించాడు. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్ వచ్చి ప్రొద్దుటూరు రైల్వేస్టేషన్ వైపున ఉన్న రైలు పట్టాలపై పడుకుని తన స్నేహితులకు వీడియా కాల్ చేసి తాను చనిపోతున్నట్లు తెలిపారు. వెంటనే ఈ సమాచారాన్ని అతని స్నేహితులు ఎర్రగుంట్ల రైల్వే పోలీసులకు తెలియజేశారు. వీడియా కాల్‌లో రైలు పట్టాలపై ఉన్న పోల్ నంబర్ ఆధారం చేసుకుని ఎర్రగుంట్ల రైల్వే కానిస్టేబుల్ సర్వేశ్వరరెడ్డి వెళ్లి.. నాగవీర చైతన్యకు మంచి మాటలు చెప్పి స్టేషన్‌కు తీసుకు వచ్చారు. తర్వాత కౌన్సెలింగ్ ఇచ్చి నాగవీరచైతన్యను తన స్నేహితులైన తరుణ్‌కుమార్‌రావు, రంగమోహన్‌కు అప్పగించి ఇంటికి పంపించారు.


