డ్రిప్‌ దరఖాస్తుల స్థితి | - | Sakshi
Sakshi News home page

డ్రిప్‌ దరఖాస్తుల స్థితి

Sep 19 2026 4:14 AM | Updated on Sep 19 2026 4:14 AM

డ్రిప్‌ దరఖాస్తుల స్థితి

రైతులకు సమాచారం ఇచ్చాం

సాక్షి, మదనపల్లె: జిల్లాలో వ్యవసాయం దారుణమైన పరిస్థితుల్లోకి వెళుతోంది. ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌ దయనీయంగా ముగిసింది. సాగు విస్తీర్ణంలో 25% కూడా పంటలు సాగుకు నోచుకోలేదు. ఈ పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడే పరిస్థితులు దాపురిస్తున్నాయి. చినుకు జాడ లేకపోవడం, ఇప్పట్లో వర్షాలు కురిసే పరిస్థితులు కనిపించకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. దీని ప్రభావం సూక్ష్మ సాగునీటి సేద్యంపై ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ నీటి పథకం కోసం ప్రభుత్వం రూ.68 కోట్లు కేటాయించగా ఇప్పటిదాకా రూ.16 కోట్లు మాత్రమే సద్వినియోగం అయ్యాయని అధికారులు చెబుతున్నారు.

డ్రిప్‌ కోసం పోటాపోటీ

తక్కువ నీటి ఖర్చుతో అధిక విస్తీర్ణంలో పంటలు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. దీనికి సూక్ష్మ నీటి సేద్యానికి స్ప్రింక్లర్లు, డ్రిప్‌ పరికరాలు రైతులకు చాలా అవసరం. ప్రభుత్వం వీటిని 90% రాయితీతో రైతులకు అందిస్తోంది. ప్రతి సంవత్సరం రైతులు వీటిని మంజూరు చేయించుకునేందుకు వేల సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటారు. 32కి పైగా ఉన్న డ్రిప్‌ కంపెనీల్లో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం రైతులకు ఉంటుంది.

6,718 మంది రైతుల దరఖాస్తు

సూక్ష్మ నీటి పరికరాల కోసం జిల్లాలో ఈ ఏడాది 6718 మంది రైతులు ఆన్‌ లైన్‌ ద్వారా తమ దరఖాస్తులను రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారితోపాటు, ఏడేళ్ల క్రితం పథకం లబ్ది పొందిన రైతులు ఉన్నారు. వీరికి పథకం మంజూరు చేసేందుకు జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ లక్ష్మీ ప్రసన్న జిల్లా వ్యాప్తంగా రైతుల పొలాలు, బోర్లను క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేశారు. అర్హులైన రైతులను గుర్తించి ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు.

కట్టింది 1,304 మందే

6718 మంది రైతులు 7,775 హెక్టార్ల భూమికి సూక్ష్మ నీటి పరికరాలు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3,299 మంది రైతులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేశారు. వీరిలో 3,213 మందిని సూక్ష్మ పథకానికి ఎంపిక చేస్తూ సమాచారాన్ని పంపారు. అయితే పథకం లబ్ధి పొందేందుకు 10% వాటా సొమ్మును 1,304 మంది రైతులు మాత్రమే డీడీలు చెల్లించారు. మిగిలిన 1,909 మంది ఇంతవరకు 10 శాతం వాటా సొమ్ము చెల్లించలేదు. జిల్లాలో 7,775 హెక్టార్లలో సూక్ష్మసేద్యం సాగు చేసేందుకు రైతులు సిద్ధమైతే అందుకు స్పందించిన వారు అతి తక్కువ మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సూక్ష్మ సాగునీటి సేద్యంపై ప్రభావం చూపిస్తోంది.

నీటి లభ్యతపైనే ఆందోళన

జిల్లాలో భూగర్భ జలమట్టాలు దారుణంగా పడిపోతున్నాయి. వర్షాలు లేకపోవడం, ఎండలు కొనసాగడంతో నీటి మట్టాలపై ప్రభావితం చూపిస్తోంది. వ్యవసాయ పంటలకు అనుగుణంగా నీటి అవసరం ఉంటుంది. అయితే జూలై నెల నుంచి వర్షాలు లేకపోవడం, భూగర్భ జలాలు వాడకంలో మార్పు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. సేద్యానికి బోర్ల నుంచి నీటి లభ్యత తగ్గిపోతోంది. ఈ పరిస్థితి మున్ముందు ఇంకా అధికం కానుంది. ఇప్పుడు ఉన్న నీటితో పంటలు సాగు చేస్తే దిగుబడి వచ్చే సమయానికి నీటి లభ్యత పూర్తిగా పడిపోతే పెట్టిన పెట్టుబడితో పాటు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోక తప్పదు. ముందుగా గుర్తించి రైతులు సాగుపై వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. దీని ఫలితంగానే సూక్ష్మ సాగునీటి పథకం లబ్ధి పొందేందుకు రైతులు జాప్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది. లక్ష విలువైన యూనిట్‌ కు రైతులు చెల్లించాల్సింది రూ.పది వేలే అయినప్పటికీ రైతులు ఆలోచిస్తున్నారు.

జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న దుర్భిక్షం

సేద్యంపై తీవ్ర ప్రభావం

సూక్ష్మ పరికరాలు కావాలని

వేల సంఖ్యలో దరఖాస్తులు

పది శాతం సొమ్ము చెల్లింపునకు నిరాసక్తత

నియోజకవర్గం దరఖాస్తులు హెక్టార్లు డీడీలు

కట్టింది

మదనపల్లె 945 934 103

తంబళ్లపల్లె 1,630 1,916 233

పీలేరు 1,334 1,607 386

పుంగనూరు 1,113 1,223 173

రాయచోటి 1,696 2,095 409

సూక్ష్మనీటి సేద్యం పరికరాల కోసం దరఖాస్తు చేసుకుని ఎంపిక చేసిన రైతులకు సమాచారం పంపించాం. వారిలో సగం మంది రైతులే తమ పదిశాతం వాటాగా డీడీలు చెల్లించారు. మిగిలివారు చెల్లించలేదు. వర్షాభావ పరిస్థితులు, భూగర్భజలాలపై ఆందోళనతో రైతులు ముందుకు రావడం లేదని అనుమానిస్తున్నాం. పథకానికి ఎంపికై న ప్రతి రైతుకు సూక్ష్మనీటి పరికరాలను అందిస్తాం. – లక్ష్మీప్రసన్న, పీడీ, ఏపీఎంఐపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement