నెత్తురోడిన రహదారులు | - | Sakshi
Sakshi News home page

నెత్తురోడిన రహదారులు

Sep 19 2026 4:14 AM | Updated on Sep 19 2026 4:14 AM

● పాలసేకరణకు వచ్చి..

జిల్లాలో శుక్రవారం రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రాణాలు మార్గమధ్యలోనే అనంతవాయువుల్లో కలిసిపోవడంతో ఆయా కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది.
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురుగు దుర్మరణం

మతలబ్‌, కాశం మృతదేహాలు

సంబేపల్లె : కుటుంబ పోషణలో భాగంగా పాల సేకరణకు వచ్చిన ఇద్దరు వ్యాపారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సంబేపల్లె మండల కేంద్ర పరిధిలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. రౌతుకుంట గ్రామం వంగిమళ్లవాండ్లపల్లెకు చెందిన పి.బాబాఫకృద్దీన్‌ (అలీ) (32), పి.కలందర్‌ (42) వ్యవసాయంతో పాటు పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి ద్విచక్రవాహనంపై సంబేపల్లె మండల కేంద్రానికి వచ్చి ఓ రైతుకు పాల క్యాను ఇచ్చి బాటిల్‌లో పాలు తీసుకొని ఇంటికి వెళుతుండగా చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై నామాలగుట్ట సమీపంలోకి రాగానే తిరుపతి నుంచి రాయచోటి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. వీరి మృతితో రౌతుకుంటలో విషాదచాయలు అలముకున్నాయి. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పాలు తీసుకోవడానికి వెళ్లి భర్త విగతజీవిగా మారాడని తెలుసుకున్న అలీ భార్య, ఇద్దరు పిల్లలు బోరున విలపించారు. మరోవైపు కలందర్‌ కుటుంబ సభ్యులు, కువైట్‌లో ఉండటంతో వారి బాధ వర్ణణాతీతమని గ్రామస్తులు చెప్పారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో రోడ్డు దాటుతున్న రాజాకు తీవ్రగాయాలయ్యాయి. సంఘటనా స్థలాన్ని రాయచోటి రూరల్‌ సీఐ రోషన్‌ పరిశీలించారు.

గాలివీడు : మండలంలోని నూలివీడు పంచాయతీ తానాబాయి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్‌ బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. అస్సాం రాష్ట్రానికి చెందిన అబ్దుల్‌ మతలబ్‌ (25), కాశం (23) రామాపురం మండలంలో జలజీవన్‌ మిషన్‌ పనుల్లో భాగంగా నీటి ట్యాంకుల నిర్మాణానికి కూలీలుగా వచ్చారు. శుక్రవారం గాలివీడుకు వచ్చి ఇనుప కడ్డీలను ట్రాక్టర్‌లో తరలిస్తుండగా దేవరకొండ సమీపంలోని తానాబాయి వద్ద ఎదురుగా నిలిపి ఉన్న లారీలను తప్పించబోయారు. ఈ క్రమంలో ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాక్టర్‌లో ఉన్న ఇనుప కడ్డీలు అబ్దుల్‌ మతలబ్‌, కాశంపై పడటంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్‌ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement