సాక్షి, మదనపల్లె: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మదనపల్లె సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీకి ఎన్నికల నిర్వహణ కోసం మున్సిపల్ డీఎంఏ సంపత్ కుమార్ ఎన్నికల అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్ ఎన్నిక నిర్వహణ అధికారిగా ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, సహాయ ఎన్నికల అధికారిగా కె.మాధవరెడ్డిలను నియమించారు. 48 వార్డులకుగాను ప్రతి నాలుగు వార్డులకు ఒక ఎన్నికల అధికారి, ఒక అదనపు ఎన్నికల అధికారి, ఒక సహాయ ఎన్నికల అధికారిని నియమించారు. వార్డులకు నియమించిన ఎన్నికల అధికారులు..జి.దీనదయాల్ రాజు, వై. కృష్ణకిషోర్, సూర్యనారాయణరెడ్డి, రాజశేఖర్ తుమ్మడి, కే.ప్రభాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వరప్రసాద్ నాయుడు, పి.వెంకట ప్రతాప్, చిన్నరెడ్డి, రోషన్ జమీర్, ప్రవీణ్ కుమార్, రవీంద్రనాథ్ రెడ్డి, జ్యోతి, సుబ్బరాయుడు ఉన్నారు. వీరిలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, కళాశాలల లెక్చరర్లు ఉన్నారు. వీరికి శుక్రవారం మున్సిపల్ అధికారులు ఉత్తర్వులను అందజేశారు.
బ్యాలెట్ పేపర్లు వచ్చేశాయి
సాక్షి, మదనపల్లె : స్థానిక సంస్థలైన మున్సిపాలిటీ, గ్రా మపంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన బ్యాలెట్ పేపర్లు శుక్రవారం జిల్లా కేంద్రం మదనపల్లెకు చేరుకున్నాయి. విజయవాడ నుంచి లారీల్లో వీటిని మదనపల్లెకు తరలించారు. స్థానిక సంస్థల అధికారులు వాటిని కార్యాలయాల్లో భద్రపరిచారు. శుక్రవారం వచ్చిన వాటిలో వైట్ బ్యాలెట్ పేపర్లు మాత్రమే ఉన్నాయి. వీటిని వార్డు ఎన్నికకు ఉపయోగిస్తారు. సర్పంచ్ ఎన్నికకు ఉపయోగించే పింక్ కలర్ బ్యాలెట్ పేపర్లు శనివారం రానున్నాయి. ఈ ఖాళీ బ్యాలెట్ పేపర్లపై ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గుర్తులను ముద్రించి ఆయా స్థానిక సంస్థల ఎన్నికల ఓటింగ్‌కు ఉపయోగిస్తారు.


