● సర్‌చార్జ్ నోటీసుకు స్పందించలేదు
● క్రిమినల్ కేసు నమోదుకు కలెక్టర్
ఆదేశాలు
సాక్షి, మదనపల్లె : మదనపల్లె డివిజన్‌లోని నిమ్మనపల్లె వ్యవసాయ పరపతి సహకార సంఘంలో జరిగిన అక్రమాలు, నిధుల స్వాహాపై విచారణాధికారిగా నియమితులైన రాయచోటి సహకార అధికారి హబీబుల్లా విచారణ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. ఈ సంఘం సీఈవోగా పని చేస్తున్న హరినాథరెడ్డి రూ.2.53 కోట్లు స్వాహా చేసినట్టు అక్రమాల లెక్కను తేల్చారు. దీనిపై క్రిమినల్ కేసు నమోదుకు కలెక్టర్ నిశాంత్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నిమ్మనపల్లె సింగిల్ విండోలో ఖాతాదారులకు బంగారు ఆభరణాలపై ఇచ్చిన రుణాలకు సంబంధించి రికవరీ లేకపోవడంపై అనుమానాలు రావడంతో డీసీసీ బ్యాంక్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆభరణాలపై ఇచ్చిన రుణాలు రికవరీ అయినప్పటికీ సంఘానికి జమ కావడం లేదని గుర్తించారు. సీఈవో ఆ నిధులను స్వాహా చేశారని బ్యాంక్ అధికారుల సూచన మేరకు.. సహకార శాఖ అధికారులు జరిపిన ప్రాథమిక విచారణలో వాస్తవాలు వెలుగు చూశాయి. దీనిపై హబీబుల్లాను విచారణ అధికారిగా డీసీఓ గురుప్రకాష్ నియమించారు. సుదీర్ఘంగా జరిగిన విచారణలో హరినాథరెడ్డి బంగారు ఆభరణాలపై ఇచ్చిన రుణాల సొమ్ము రూ.2.07 కోట్లు, ఇతర రుణాలకు సంబంధించిన రూ.46 లక్షల నిధులు సంఘానికి జమ చేయకుండా రికవరీ సొమ్మును స్వాహా చేశారని లెక్క తేల్చారు. ఈ నివేదిక ఆధారంగా హరినాథ్‌రెడ్డికి సహకార అధికారులు సర్ చార్జ్ నోటీసు జారీ చేశారు. దీనిపై సమాధానం చెప్పేందుకు విచారణకు హాజరు కాలేదు. అనంతరం విధుల స్వాహాపై జిల్లా కలెక్టర్‌కు నివేదించారు.
కేసు నమోదుకు కలెక్టర్ ఆదేశం
నిమ్మనపల్లె ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సీఈవో హరినాథ్‌రెడ్డి రూ.2.53 కోట్లు స్వాహా చేసినట్లు తేలడంపై జిల్లా కలెక్టర్ చర్యలకు ఆదేశించారు. ఈనెల 15న కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల మేరకు హరినాథ్‌రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో శాఖ పరంగా మదనపల్లె డివిజనల్ కో–ఆపరేటివ్ అధికారి జమీర్ నిమ్మనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను ఫిర్యాదుతోపాటు అందిస్తారు. కాగా ఈ నిధులు స్వాహాపై ఇప్పటికే పర్సన్ ఇన్‌చార్జ్ మార్చి 7న నిమ్మనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు కాలేదు. హరినాథరెడ్డిపై క్రిమినల్ కేసు నమోదుకు కలెక్టర్ ఆదేశాలతో నిమ్మనపల్లె పోలీసులకు ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నట్టు డివిజనల్ కోఆపరేటివ్ అధికారి జమీర్ శుక్రవారం చెప్పారు.


