మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లాలో నేరాల నియంత్రణ, శాసీ్త్రయ ఆధారాల సేకరణే లక్ష్యంగా ఏపీ ఎఫ్‌ఎస్‌ఎల్ కేటాయించిన అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని శుక్రవారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రారంభించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మంజూరు చేసిన ఈ వాహనం మదనపల్లెకు వచ్చింది. అనంతరం వాహనాన్ని జిల్లా క్లూస్ టీమ్ ఇన్‌చార్జి, ఫింగర్ ప్రింట్ ఇన్‌స్పెక్టర్ బి.సునీల్‌కు అప్పగించారు. నేర స్థలంలో నిందితులు రక్తపు మరకలు, వేలిముద్రలు తుడిచి వేసి సాక్ష్యాలను మాయం చేసేందుకు ప్రయత్నించినా ఈ వాహనం ద్వారా వెంటనే పసిగట్టవచ్చు. దీనిలో హై–ఇంటెన్సిటీ లైట్, డీఎన్‌ఏ పరీక్ష కిట్లు సహా 10 రకాల అత్యాధునిక సాంకేతిక పరికరాలు, మైక్రోస్కోప్ అందుబాటులో ఉన్నాయి. ఈ పరిజ్ఞానం ద్వారా హిట్ అండ్ రన్ కేసులు, లైంగిక దాడులు, గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, తుపాకీ కాల్పుల ఘటనలు వంటి తీవ్ర నేరాల్లో స్పాట్‌లోనే ఆధారాలను సేకరించడానికి వీలు అవుతుంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పక్కా ఆధారాలు సేకరించి నేరస్తులకు చట్ట ప్రకారం కఠిన శిక్షలు పడేలా చేస్తామన్నారు. నేరం చేసి తప్పించుకోవచ్చనే భ్రమలో ఎవరైనా ఉంటే ఇకపై ఆ ఆలోచన వదిలేయాలని హెచ్చరించారు.


