ఒంటరితనం భరించలేక వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఒంటరితనం భరించలేక వ్యక్తి ఆత్మహత్య

Sep 19 2026 4:14 AM | Updated on Sep 19 2026 4:14 AM

ఒంటరితనం భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేపలు పట్టేందుకు వెళ్లి మృత్యువాత అదనపు కట్నం వేధింపుల కేసు

పెద్దతిప్పసముద్రం : జీవితాంతం తోడు నీడగా ఉండాల్సిన కట్టుకున్న భార్య ఆరేళ్ల క్రితం మృతి చెందడం, మరో వైపు ఒంటరితనాన్ని భరించలేక ఓ వ్యక్తి ఎలుకల నివారణ మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ పరమేశ్‌ నాయక్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కమ్మచెరువుకు చెందిన టి.వెంకట్రాయప్ప(60) భార్య అంజమ్మ ఆరేళ్ల క్రితం మృతి చెందడాన్ని భర్త వెంకట్రాయప్ప జీర్ణించుకోలేక పోయాడు. అప్పటి నుంచి మద్యానికి అలవాటు పడ్డాడు. ఈ నేపథ్యంలో ఒంటరితనం భరించలేక జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. ఈ తరుణంలో ఈ నెల 15న ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు అతనికి బి.కొత్తకోట, మదనపల్లి ఆసుపత్రుల్లో వైద్యం చేయించారు. అయినా పరిస్థితి విషమంగా మారడంతో డాక్టర్ల సూచనల మేరకు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి కుమారుడు గౌతమ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శుక్రవారం వెల్లడించారు.

ములకలచెరువు : చేపలు పట్టేందుకు వెళ్లి ప్రాజెక్టులో మునిగి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు... మండలంలోని చౌడసముద్రంకు చెందిన ఎస్‌.మహబూబ్‌బాషా కుమారుడు బావాజాన్‌(38) అప్పుడప్పుడు దగ్గరలోని పెద్దేరు ప్రాజెక్టుకు వెళ్లి చేపలు పట్టడానికి వెళ్లేవాడు. గురువారం చేపలు పట్టడానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. రాత్రి సైతం ఇంటికి రాలేదు. శుక్రవారం ఉదయం గ్రామస్తులతో కలిసి ప్రాజెక్టు వద్దకు వెళ్లి నీటిలో గాలించడంతో బావాజాన్‌ మృతదేహం లభించింది. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. మృతుడి బావాజాన్‌ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తంబళ్లపల్లె ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ వివరించారు.

కలకడ : అదనపు కట్నం వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ అబ్దుల్‌ముజీర్‌ తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఎర్రకోటపల్లె పంచాయతీ మల్లవరంవాండ్లపల్లె గ్రామానికి చెందిన ఉప్పుటోళ్ళ వెంకటరమణ కుమార్తె రూపను 2021లో వాల్మీకిపురం మండలం చింతపర్తి పంచాయతీ ఎర్తివాండ్లపల్లెకు చెందిన భాస్కర్‌, స్వాతిల కుమారుడు సుధీర్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. తనను భర్త సుధీర్‌ అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, అత్త స్వాతి, మామ భాస్కర్‌ కూడా కుమారిడికి సహకరించి వేధింపులకు గురి చేస్తున్నారని రూప పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం సుధీర్‌, భాస్కర్‌, స్వాతిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ అబ్దుల్‌ముజీర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement