మదనపల్లె టౌన్ : ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఐదు కిలోమీటర్ల మారథాన్(పరుగు) నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ మారథాన్‌లో వివిధ కళాశాలలకు చెందిన రెడ్ రిబ్బన్ క్లబ్ విద్యార్థులు, వైద్య సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. మారథాన్‌ను అడిషనల్ డీఎంహెచ్‌ఓ, ఎయిడ్స్ అన్నమయ్య, కడప జిల్లాల క్లస్టర్ మేనేజర్ భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి, నివారణ చర్యలు, అపోహల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులు, వైద్య సిబ్బంది నినాదాలు చేశారు. యువతలో ఎయిడ్స్‌పై అవగాహన పెంచడం, సురక్షితమైన జీవన విధానంపై చైతన్యం కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎయిడ్స్‌పై సరైన అవగాహన పెంచుకుని, వ్యాధి నివారణలో భాగస్వాములు కావాలని వారు కోరారు.


