● రాయచోటిలో రెచ్చిపోయిన
టీడీపీ కార్యకర్తలు
● వర్గాలుగా విడిపోయి కొట్టుకున్న వైనం
● అడ్డొచ్చిన మహిళలపై కూడా దాడి
రాయచోటి : భక్తి, సంతోషం, ఆహ్లాదంగా జరుపుకోవాల్సిన గణనాథుని నిమజ్జనం.. కాస్త తమ్ముళ్లు వర్గాలుగా విడిపోయి దాడులు, ప్రతి దాడులతో ఆ ప్రాంతం అంత భయానక వాతావరణాన్ని సృష్టించింది. రాయచోటి పట్టణ పరిధిలోని రాజుల కాలనీలో శుక్రవారం చోటు చేసుకున్న సంఘటన చర్చనీయాంశంగా మారింది. విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో టీడీపీ వర్గీయుల మధ్య పెరిగిన మాటల యుద్ధం దాడుల వరకు దారి తీసింది. చేతులకు దొరికిన ఆయుధాలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల సమయంలో అడ్డువచ్చిన మహిళలపై కూడా యువకులు విచక్షణ రహితంగా చేసిన దాడుల దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇళ్లలోకి దూరి కొట్టుకున్న యువకులను అడ్డుకునే ప్రయత్నం చేసినా పోలీసులను లెక్కచేయకుండా కొట్టుకోవడం గమనార్హం. దాడుల సమయంలో వారి వారి వర్గాలకు చెందిన గ్యాంగ్‌ల నాయకులు, యువకులు రావడంతో కాలనీ ప్రాంతమంతా యుద్ధవాతావరణాన్ని తలపించింది. రాళ్లు, కట్టెలు, రాడ్లతో దాడులను చూసిన స్థానికులు ఊరేగింపులో ఉన్న విగ్రహాన్ని వదలి ఇళ్లలోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ్ముళ్ల వీధి రౌడీ చేష్టలు అధికమాయ్యాయని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


