● కూటమిలో జనసేన మంట
ములకలచెరువు : మండలంలోని వేపూరికోటలో గురువారం ఎంపీడీఓ అమరనాథ్‌రెడ్డి టీడీపీ కార్యకర్తలతో కలిసి సచివాలయం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సచివాలయానికి ఏర్పాటు చేసిన శిలాఫలకం శుక్రవారం ధ్వంసం కావడం మండలంలో కలకలం రేపింది. కాసేపట్లోనే శిలాఫలకం ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తంబళ్లపల్లె జనసేన ఇన్‌చార్జ్ పేరు శిలాఫలకంలో లేదని, పైగా ప్రొటోకాల్ లేకుండా ప్రారంభించారని ఆగ్రహించిన జనసేన కార్యకర్తలు ధ్వంసం చేసినట్లు మండలం మొత్తం దావానంలా వ్యాపించింది. సచివాలయం సిబ్బంది రహస్యంగా వీడియో తీయడంతో అసలు విషయం బయటపడింది. ఇద్దరు యువకులు కారులో సచివాలయం వద్దకు చేరుకొని ‘మేము మద్దినాయునిపల్లెకు చెందిన జనసేన కార్యకర్తలం, ఎంపీడీఓను కలిసేందుకు కార్యాలయానికి వెళ్తే అక్కడ ఆయన లేకపోవడంతో ఇక్కడి వచ్చామని... సుత్తి సాయంతో శిలాఫలకం ధ్వంసం చేసి.. ఎవరైనా అడిగితే నా పేరు మూర్తి అని చెప్పండి’ అని వీడియోలో ఉంది. దీనిపై ఎంపీడీఓ అమరనాథ్‌రెడ్డిని వివరణ కోరగా... నిందితులపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కార్యదర్శి మనోహర్‌కు ఆదేసించినట్లు వివరించారు.


