● కేసు ఛేదనలో పోలీసులు జాప్యం
చేస్తున్నారని ఆవేదన
మదనపల్లె టౌన్ : కుమార్తె కనిపించకుండా పోయి రోజులు గడుస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ తండ్రి పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గుర్రంకొండ మండలంలో జరిగింది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుర్రంకొండ మండలం టి. రాచపల్లి పంచాయతీ పరిధిలోని గంగిరెడ్డి గారిపల్లె గ్రామానికి చెందిన కె.రామచంద్ర కుమార్తె అనురాధ(18) గత నెల 31వ తేదీ నుంచి ఇంట్లో కనిపించడం లేదు. ఆమె కోసం కుటుంబ సభ్యులు అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కె.రెడ్డి మోహన్‌పై అనుమానం ఉందంటూ రామచంద్ర గుర్రంకొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసి ఇన్ని రోజులవుతున్నా పోలీసులు తమ కుమార్తె ఆచూకీ కనుక్కోవడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరగకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రామచంద్ర శుక్రవారం తన నివాసంలో పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేసి, కనిపించకుండా పోయిన యువతిని వెంటనే వెతికి పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


